రాహుల్ గాంధీపై అసోం సిఎం అభ్యంతరకర వ్యాఖ్యలు
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, వ్యాక్సిన్ల గురించి గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. తామెప్పుడైనా రాహుల్ గాంధీ పుట్టుక గురించి ప్రశ్నించామా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో బిజెపితరఫున ప్రచారంలో భాగంగా శుక్రవారం జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ 2016లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ ఆధారాలు అడిగారు. రాహుల్ వ్యక్తిగత విషయాలపై తామెప్పుడైనా ఇలా అడిగామా? పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారని మన సైనికులు చెబితే అదే ఫైనల్.
దానికి ఆధారాలు కావాలని సైన్యాన్ని అడిగే హక్కు ఎవరిచ్చారు?’ అంటూ హిమంత బిశ్వ శర్మ రాహుల్‌పై ధ్వజమెత్తారు. ఈవిషయంలో సౌనికులను కించపరచవద్దని కోరారు. హిజాబ్ వివాదంపైనా స్పందిస్తూ, పాడశాలలు, కళాశాలల్లో కేవలం యూనిఫామ్‌ను మాత్రమే అనుమతించాలని అన్నారు. ఇది విద్యార్థుల మధ్య సమానత్వాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు. ముస్లిం విద్యార్థినులు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకొంటున్నారని, అయితే కాంగ్రెస్ మాత్రం హిజాబ్ వివాదంలోనే బిజీగా ఉండాలని చెబుతోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ వివాదం చాలా వరకు సమసిపోతుందని ఆయన అన్నారు.