ఐదుగురు పోలీస్ సిబ్బంది సస్పెన్షన్
సిల్చార్ (అస్సోం): అస్సోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 1న పోలింగ్ కేంద్రంలో కాల్పులు సంభవించడానికి బాధ్యులన్న ఆరోపణపై అస్సోం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అమినూల్ హక్ లస్కర్‌ను పోలీసులు రెండుసార్లు 48 గంటల పాటు విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఆయనతో ఉన్న ఐదుగురు పోలీస్‌లను సస్పెండ్ చేశారు. సొనాయి నియోజక వర్గం 463 మధ్య దనేహోరి ఎల్‌పి స్కూలు లోని పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 1న బిజెపి మద్దతు దార్లకు, ఎఐయుడిఎఫ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా డిప్యూటీ స్పీకర్ లష్కర్ అంగరక్షకులు కాల్పులు జరిపారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సొనాయి స్థానం నుంచి స్థానిక ఎమ్‌ఎల్‌ఎ లష్కర్, ఎఐయుడిఎఫ్ అభ్యర్థి కరీం యుద్దీన్ బర్భుయాతో ప్రత్యక్షంగా పోటీ పడుతున్నారు. ఈ సంఘటనపై పోలీస్ సూపరింటెండెంట్ భన్వర్ లాల్ మీనా మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్‌కు రక్షణ కోసం నియామకమైన తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని విధుల నుంచి తొలగించడమైందని చెప్పారు. వీరిలో ఐదుగురిని సస్పెండ్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.