గువాహటి: ఉగ్రరూపం దాలుస్తున్న కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా అస్సాం ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫూను విధించింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మే 1వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అస్సాంలోని అన్ని జిల్లాలలో రాత్రి కర్ఫూ అమలులో ఉంటుందని, నిత్యావసర, అత్యవసర కార్యకలాపాలు, సర్వీసులకు మినహాయింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో కొన్ని మినహాయింపులు తప్పించి పౌరులెవరూ రోడ్లపైన సంచరించకూడదని ఆయన తెలిపారు. అన్ని మార్కెట్లు, దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని, కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తితోసహా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని 51, 60 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
Assam Govt Impose Night Curfew till may 1