అసోం మిజోరం అంగీకారం
ఐజ్వాల్: జటిల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను తొలిగించుకోవాలని అసోం మిజోరం నిర్ణయానికి వచ్చాయి. శతాబ్ధపు సరిహద్దు వివాదంపై సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. తగు విధమైన పరిష్కారం దిశలో చర్యలు తీసుకోవాలి. ముందుగా ఇరు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలను పునరుద్ధరించుకోవాలి. సంబంధిత రాష్ట్రాల పోలీసు బలగాలను ఘర్షణల ప్రాంతానికి వెలుపల ఉంచాలి. ఉద్రిక్తతల సడలింపునకు ఉభయపక్షాలూ సహకరించుకోవాలని సంకల్పించాయి. రెండు రాష్ట్రాల ప్రతినిధుల స్థాయి సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. గత నెల 26వ తేదీన ఇరు రాష్ట్రాల సరిహద్దులలో పోలీసు బృందాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. ఓ పౌరుడు బలి అయ్యాడు. పలువురు గాయపడ్డారు. సరిహద్దుల వెంబడి శాంతిసామరస్య పునరుద్ధరణకు పాటుపడాలని ఇప్పటి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అసోం సరిహద్దు ప్రాంత అభివృద్ధి వ్యవహారాల మంత్ర అతుల్ బోరా తెలిపారు. ఆయన అసోం బృందానికి నాయకత్వం వహించారు.
మిజో ప్రయాణ నిషేధ సలహా రద్దు
మిజోరంలో అస్సామీలు పర్యటించరాదనే తమ సూచనలను ఉపసంహరించుకుంటున్నట్లు అసోంలోని బిజెపి ప్రభుత్వం తెలిపింది. ఇరు రాష్ట్రాల ప్రతినిధుల స్థాయి బృందం చర్చలు తరువాత వెలువడిన సంయుక్త ప్రకటనను పరిగణనలోకి తీసుకుని ఇంతకు ముందటి అడ్వయిజరీని వెనకకు తీసుకున్నారు. గత నెల 29 నాటి సలహాను ఉపసంహరించుకుంటున్నట్లు తాజా ఉత్తర్వులలో గురువారం తెలిపారు.