వెంటనే అరెస్టు..దేశ ద్రోహం కేసు నమోదు
గువహతి : అస్సోంలో ప్రతిపక్షం అయిన ఆలిండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పహల్గామ్ ఉగ్రదాడులను సమర్థిస్తూ ప్రకటన వెలువరించడం, ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇవ్వడాన్ని సమర్థించడం తీవ్ర అంశం అయింది. దేశ ద్రోహం అభియోగాల పరిధిలో ఆయనపై కేసు నమోదు చేసి , అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఓ వైపు ఇప్పటి దాడులలో పాకిస్థాన్ ప్రమేయంపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధి అయిన ఇస్లామ్ వ్యాఖ్యలు సంచలనానికి దారితీసింది. ఎమ్మెల్యే వ్యవహార శైలిని ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ తప్పుపట్టారు.
తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఎఐయుడిఎఫ్ ఓ ప్రకటన వెలువరించింది.ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అయి ఉంటాయి. పార్టీకి వీటికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాకిస్థాన్‌ను సమర్థించారు. ఈ విషయం ఇతరుల ద్వారా తన దృష్టికి వచ్చింది. వెంటనే తగు చర్యలకు ఆదేశించామని, తరువాత డిజిపి వచ్చి తనకు సదరు ఎమ్మెల్యే అరెస్టు సమాచారం ఇచ్చారని సిఎం మీడియాకు తెలిపారు.
నాగోన్ జిల్లాలో ఆయన నివాసం నుంచి పోలీసులు తీసుకువెళ్లారు. కోర్టు ముందు హాజరుపరుస్తారు. తరువాత చట్టబద్ధంగా చర్యలు ఉంటాయి. ఓ వైపు కశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయక పౌరులను మట్టుబెడితే , ఈ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచే పాకిస్థాన్ కొమ్ము కాయడం నేరం అవుతుందని, ఇటువంటి వాటిని సహించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.