Monday, November 25, 2024

హిందువుల లేటు వివాహాల వ్యాఖ్యలపై ఎంపీ అజ్మల్ క్షమాపణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. సీనియర్ నేతగా తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని తెలిపారు.

”మరో మతం వారి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. ఒక సీనియర్ నేతగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. నా వ్యాఖ్యలు ఎవరిని బాధించినా వారికి క్షమాపణలు చెబుతున్నాను. చాలా సిగ్గుపడుతున్నాను. మైనారిటీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, విద్య, ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను” అని అజ్మల్ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా ఆయన అన్నారు. ‘హిందూ’ అనే పదం తాను వాడలేదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలు వివాదం కావడంతో తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఇందుకు సిగ్గుపడుతున్నట్టు తెలిపారు.

బద్రుద్దీన్ అజ్మల్ గత శుక్రవారంనాడు హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అన్నారు. అదే ముస్లిం యువకులు 21 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లిళ్లు చేసుకుంటారని, హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని 40 ఏళ్ల వరకూ అవివాహితులుగానే ఉంటారన్నారు.

”ఇంత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు? హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణం. సారవంతమైన భూమిలో విత్తనాలు సకాలంలో నాటితే మంచి పంట వస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల విషయంలో ముస్లింలు అనుసరించిన విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలని ఆయన నాడు సూచించారు. హిందూ బాలికలు 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే ఎక్కువ పిల్లలు పుడతారన్నారు. దాంతో  అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News