Friday, December 20, 2024

అసోం పోలీసుల అరెస్టులు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే ఎటువంటి అనుమానానికి చోటు లేకుండా అర్థమైపోయిన ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడ ఈ ఘటనతో మరింత స్పష్టమైంది. వెల్లడిగానైనా వ్యంగ్యంగానైనా తన మీద గాని, తన ప్రభుత్వంపైన గాని పల్లెత్తు విమర్శ చేసినా సహించబోనని దేశాధినేత మరొకసారి హెచ్చరించినట్లు అనిపించడాన్ని ఎంతమాత్రం ఆక్షేపించలేము. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ విస్తృత (ప్లీనరీ) స్థాయి సమావేశంలో పాల్గొనడానికి సహచరులతో వెడుతున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేడాను ఢిల్లీ విమానాశ్రయంలో మాయ మాటలు చెప్పి విమానం నుంచి బలవంతంగా దించివేసి అరెస్టు చేసిన తీరు ఎంతైనా ఖండించదగినది.

గగ్గోలెత్తిస్తున్న అదానీ షేర్ మార్కెట్ కుంభకోణంతో ముడిపెడుతూ ప్రధాని మోడీని ‘నరేంద్ర గౌతమ్ దాస్ మోడీ’ అని అన్నందుకు అసోం పోలీసులు కేసు పెట్టి ఈ అరెస్టుకు పాల్పడడం గమనించవలసిన విషయం. ప్రత్యర్థులపై పగ సాధించవలసినప్పుడల్లా అసోం పోలీసులు రంగ ప్రవేశం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అటువంటి సందర్భాల్లో అసోం ముఖ్యమంత్రి బిజెపి అగ్రనేతలకు అందివస్తున్నారు. కొంత కాలం క్రితం గుజరాత్ ఎంఎల్‌ఎ (అప్పటి ఇండిపెండెంట్, ఇప్పటి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ) జిగ్నేశ్ మేవానీని కూడా ఇదే పద్ధతిలో అసోం పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు. మత కలహాలను రెచ్చగొట్టే విధంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశాడనే ఆరోపణ మీద గత ఏడాది ఏప్రిల్‌లో మేవానీని అసోం పోలీసులు గుజరాత్‌లోని ఓ అతిథి గృహం నుంచి అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకు వెళ్ళిపోయారు. ఐదు రోజుల తర్వాత అహ్మదాబాద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేశాడనే మరో ఆరోపణ మీద ఆయనను అసోం పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు.

ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులను అరెస్టులతో వేధించడం ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం చెల్లని వ్యవహారం. పవన్ ఖేడా ప్రధాని మోడీని విమర్శించిన తీరు దేశంలో ఎంత మాత్రం వింతది గాని, కొత్తది గాని కాదు. దానిపై ఆయనను కోర్టుకి ఈడ్చడానికి ఇతర మార్గాలున్నాయి. పోలీసులు ఉన్నపళంగా విమానంలోంచి దించివేసి తీసుకుపోడం బొత్తిగా సమర్థించదగిన చర్య కాదు. భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, తమ దేశం ప్రజాస్వామ్యానికి మాతృదేశమనే విషయం తలచుకొని భారతీయులు గర్వపడతారని ప్రధాని మోడీ ఇటీవల ఒక సందర్భంలో ఘనంగా చెప్పుకొన్నారు. ప్రజాస్వామ్యం మన నరనరానా ప్రవహిస్తున్నదని, అది మన సంస్కృతిలోనే వున్నదని, పూర్వ కాలం నుంచి మనది ప్రజాస్వామిక సమాజమని ఆయన శ్లాఘించారు. బుద్ధుడిని, డాక్టర్ అంబేడ్కర్‌ని ప్రస్తావించారు. కాని ఈ విధంగా ప్రత్యర్థులను అరెస్టులతో, ఇడి దాడులతో, సిబిఐ సోదాలతో భయభ్రాంతులను చేయడం, కేవలం ప్రతిపక్షాలపైనే వాటిని విచక్షణా రహితంగా ప్రయోగించడం ఏ విధంగా ప్రజాస్వామిక సత్సంప్రదాయం కిందికి వస్తుందో అర్థం కావడం లేదు.

మాటల్లో ప్రజాస్వామ్య విలువలను పొగుడుతూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం బహుశా మోడీ మార్క్ ప్రజాస్వామ్యం అనుకోవాలి. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ జరగడానికి కొద్ది రోజుల ముందే అక్కడి ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకుల ఆవరణల్లో ఇడి దాడులు జరిగాయి. బొగ్గు మీద అక్రమ వసూళ్ళు చేసి దొడ్డి దారిలో తరలించారంటూ మనీలాండరింగ్ కేసులు పెట్టి ఈ దాడులకు తెగబడ్డారు. దీనిని సహజంగానే ప్లీనరీతో ముడిపెట్టి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వారికే కాదు ప్రజాస్వామ్య ఆలోచనాపరులెవరికైనా అలాగే అనిపించింది. అంతకు మించి వేరే అనుకోడానికి అవకాశం లేదు.

బొగ్గు అక్రమాలపై ఇడి దాడులు జరపడానికి సరిగ్గా ఇదే సమయం కావలసి వచ్చిందా? ఇటువంటి దాడుల ద్వారా తాము కాంగ్రెస్ ప్రతిష్ఠను పెంచుతున్నామని, ప్రజల్లో దాని పట్ల సానుభూతి పెరిగేలా చేస్తున్నామనే స్పృహ ప్రధాని మోడీకి గాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు గాని, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు గాని కలగకపోడం ఆశ్చర్యపోవలసిన విషయమే. అధికారం తలకెక్కినప్పుడే ఇటువంటివి జరుగుతుంటాయి. పైపెచ్చు అధికార సింహాసనం నుంచి తమను దించగలిగే శక్తి లేదని, కాంగ్రెస్ సహా ప్రతిపక్షం దారుణంగా డీలా పడివున్నాయనే దృష్టి బిజెపిలో విపరీతంగా వుందని ఇటువంటి సందర్భాలు గుర్తు చేస్తుంటాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అసాధారణమైన స్పందన, మద్దతు వ్యక్తమైనందునే తమ మీద ప్రధాని మోడీ ప్రభుత్వం ఇలా కక్షకట్టిందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఆ పార్టీకి మేలు చేసే అంశమైనప్పటికీ బిజెపిని దించడానికి అది చాలదు. అది కేవలం కాంగ్రెస్ ఒక్క దాని వల్లనే జరిగే పని కాదు. అందుచేత రాయ్‌పూర్ ప్లీనరీలో ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల కోసం దేశంలో మార్పు కోరుతున్న ప్రజలు ఎదురు చూడడం సహజం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News