మర్మాంగంపై కత్తితో దాడి
పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు
వివాహేతర సంబంధమే కారణమా?
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సిఐపై కానిస్టేబుల్ కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ సిసిఎస్‌లో పని చేస్తున్న సిఐ ఇఫ్తార్ అహ్మద్‌పై గురువారం పాలకొండ సమీపంలో కొంతమంది దుండగులు కారులోనే సిఐపై అటాక్ చేసి గొంతు, మర్మాంగంపై దాడి చేశారు. అనంతరం నిందితులు పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్తం మడుగులో ఉన్న సిఐని హుటాహుటిన స్థానిక ఎస్‌విఎస్ ఆసుపత్రికి తరలించారు. సిఐ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డిఐజి చౌహన్, ఎస్పీ విశ్వప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
అయితే ఈ దాడికి పాల్పడింది. మరొక స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ అని తెలుస్తోంది. సిఐ ఇఫ్తార్ అహ్మద్ కానిస్టేబుల్ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనే సిఐపై హత్యాయత్నానికి నిందితుడు పాల్పడినట్లు సమాచారం. అయితే ఈ హత్యాయత్నానికి పాల్పడింది ఒక్కరేనా? లేక మరికొంత మంది ఉన్నారా అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. సిఐపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు పోలీస్ అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.