Thursday, December 5, 2024

సుఖ్‌బీర్ బాదల్‌పై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల ‘సేవాదార్’ కర్తవ్యం నిర్వహిస్తుండగా ఒక మాజీ ఉగ్రవాది ఆయనపై కాల్పులు జరిపాడు. కాని మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ అధికారి అతనిని లొంగదీసుకోవడంతో అతని యత్నం విఫలమైంది. 2007 నుంచి 2017 వరకు పంజాబ్‌లో ఎస్‌ఎడి ప్రభుత్వం చేసిన ‘తప్పులకు’ బాదల్ ప్రాయశ్చితం రెండవ రోజు వార్త సేకరణ కోసం స్వర్ణ దేవాలయం వెలుపల సమీకృతమైన మీడియా సిబ్బంది కెమెరాల్లో ఆ దాడి నిక్షిప్తమైంది. కాలు విరిగిన కారణంగా వీల్‌చైర్‌లో కూర్చున్న బాదల్ దిశగా షూటర్ నింపాదిగా నడుస్తూ, తన జేబులో నుంచి తుపాకీ తీయడం టెలివిజన్ ఫుటేజ్‌లో కనిపించింది. బాదల్ సమీపంలో నిల్చున్న మఫ్టీలోని పోలీస్ అధికారి ఒకరు వెంటనే జోక్యం చేసుకుని దుండగీడు చేతులు పట్టేశారు.

ఆ గొడవలో ఒక తూటా బాదల్ వెనుక గోడకు తగిలింది. ఆయన గాయపడకుండా తప్పించుకున్నారు. ఆ వెంటనే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) టాస్క్ ఫోర్స్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బాదల్‌కు జడ్ ప్లస్ భద్రత ఉన్నది. కాల్పులు జరిపిన వ్యక్తిని డేరా బాబా నానక్ నివాసి, ఒక మాజీ ఉగ్రవాది నారాయణ్ సింగ్ చౌరాగా పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం అతనిని భద్రత అధికారులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు. పోలీస్ అధికారి అప్రమత్తత కారణంగా బాదల్‌పై దాడి భగ్నమైందని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ చెప్పారు. ‘నారాయణ్ సింగ్ చౌరాను అరెస్టు చేశారు. అతనిపై ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దాడిలో వాడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు’ అని భుల్లార్ తెలియజేశారు. కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. చౌరాను ప్రశ్నించిన తరువాత దాడికి కారణం తెలియరాగలదని, అతను ఒక్కడే స్వర్ణ దేవాలయానికి వచ్చాడని భుల్లార్ చెప్పారు. స్వర్ణ మందిరం వద్ద భద్రత ఏర్పాట్లు తగినంతగా ఉన్నాయని, మత విశ్వాసాల కారణంగా అక్కడకు వచ్చేవారిని పోలీసులు తనిఖీ చేయజాలరని భుల్లార్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News