మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఈ ఏడాది జమిలి ఎన్నికలు జరగబోవని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి జరగకపోవచ్చని బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం తమ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నాయకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తూ జమిలి ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టంచేశారు.
ఈ విషయంలో చాలామంది నేతలు భ్రమపడుతున్నారని, అలాంటిదేమీ ఉండకపోవచ్చని వారు నేతలకు వివరించారు. అనంతరం ప్రకాశ్ జవదేకర్ వివరిస్తూ తాను గతంలో ఇక్కడ ఇన్ ఛార్జీగా పనిచేసిన సమయానికీ, ఇప్పటికీ పోల్చుకుంటే పార్టీలో చాలా వ్యత్యాసం వచ్చిందని వెల్లడించారు. కమలం, కారు పార్టీలు ఒకటి కావని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని మదిలో పెట్టుకుని నేతలంతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచనలు చేశారు.