జిఎస్‌టి, కర్మాగారాలు, మైనార్టీ కమిషన్, పంచాయతీ రాజ్ చట్ట సవరణలు, టిమ్స్ ఆస్పత్రుల బిల్లులకు శాసనసభ గ్రీన్‌సిగ్నల్
గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులకూ మండలి ఆమోద ముద్ర
శాసనసభలో ఐదు బిల్లులకు ఆమోదం
మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో కీలక బిల్లులకు ఆమో దం లభించింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి కెసిఆర్ తరఫున శాసనసభలో మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టగా.. బిల్లుకు ఆమోదం లభించింది. టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభలో చర్చ లేకుండా కేవ లం మంత్రుల వివరణలతోనే బిల్లులకు ఆమోదం లభించింది. అలాగే.. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సైతం శాసనసభ నుంచి ఆమోదం లభించింది. ఇవాళ విపక్షాలు లేవనెత్తిన పలు ప్రశ్నలతో దద్దరిల్లిన అసెంబ్లీ సాయంత్రం 6.30 గంటల వరకు సజావుగా సాగింది. అనంతరం సభను నేటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ఐదంచెల ఆరోగ్య వ్యవస్థ : హరీశ్‌రావు
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఐదంచెల ఆరోగ్య వ్యవస్థ లో భాగంగా సూప ర్ స్పెషలిటీ, హెల్త్ కేర్ ను టిమ్స్ వంటి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రులలో చికిత్స పొందిన తరవాత సూ పర్ స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపైనా ఆధారపడవాలి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన సూపర్ స్పెషలిటీ సేవలను అందించడానికి 10 వేల సూపర్ స్పెషలిటీ పడకలను నిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. టిమ్స్ ఆసుపత్రులను ప్రపంచస్థాయి వైద్య విజ్ఞాన సంస్థలుగా ఏర్పాటు చేసి ప్రజలకు అత్యాధునిక వైద్యం మరియు వైద్య విద్యార్థులకు శిక్షణ అందించాలన్నది ముఖమంత్రి కెసిఆర్ సంకల్పంగా వెల్లించారు. టిమ్స్ ఆసుపత్రులకు ఎయిమ్స్, పీజీఐ చండీగఢ్ , ఐఐటీ , ఐఐఎం మాదిరి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి టిమ్స్ ఆక్ట్ ను చట్ట సభల ఆమోదం కోసం ప్రవేశ పెట్టామని వెల్లడించారు.