Monday, November 18, 2024

త్రిముఖ పోరులో అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఆధిపత్యం కోసం అగ్ర పార్టీల వ్యూహాలు
ఆత్మీయ సమ్మేళనాలతో బిఆర్‌ఎస్ అభ్యర్థుల బిజీ
ఇంకా అసంతృప్తులను సముదాయించడానికి కాంగ్రెస్ తంటాలు
బిసి నినాదాన్ని భుజానికెత్తుకున్న బిజెపి

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అగ్ర పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో దూసుకెళుతున్నాయి. ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్ పార్టీ సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓట్లన్నీ తమకు పడేలా వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.

బిజెపి సైతం బిసి నినాదంతో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వెనకబడిన వర్గాల ఓట్లను ఒడిసిపట్టే ఎత్తుగడతో పనిచేస్తోంది. పదేళ్లుగా పాలిస్తున్న గులాబీ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి పీఠాన్ని అధిష్టించాలని ప్రయత్నిస్తోంది. అధికారం నిలుపుకోవాలన్న లక్ష్యంతో బిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో బిఆర్‌ఎస్ నాయకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పదునైన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారు.
విపక్షాలు అంతర్మథనంలో పడేలా…
రాజకీయంలో ఉన్న అపార అనుభవంతో విపక్షాలను అంతర్మథనంలో పడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్లు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో సామాజిక వర్గాల వారీగా బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఆయా వర్గాలకు చేరువయ్యేలా హామీలు గుప్పిస్తోంది. మహిళా, యువజన, రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతోంది. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పదేళ్లు ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని ఓటర్లకు వివరించే ప్రయత్నం బిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్నారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై గులాబీ పార్టీ దృష్టి
తటస్థ ఓటర్ల మద్దతు కోసం పదేళ్లలో చేసిన ప్రగతి పనులను బిఆర్‌ఎస్ నాయకులు సమగ్రంగా వివరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో ప్రాంతీయ భేదం ఎక్కడా చూపలేదని బిఆర్‌ఎస్ పార్టీ గుర్తుచేస్తోంది. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉన్న సెటిలర్ల ఓట్లను తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన గులాబీ పార్టీ రాష్ట్రంలో పురుషులతో సమానంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. పార్టీ మ్యానిఫెస్టోలో అతివలకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఒంటరి స్త్రీలకు ఆసరా పెన్షన్, అర్హులైన వారికి మూడు వేల భృతి, రూ.400లకే గ్యాస్ బండ, మహిళాసంఘాలకు భవనాలు, ఇళ్ల స్థలాలను సైతం నారీమణులకే ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
విరివిగా సోషల్‌ మీడియా వినియోగం
పదేళ్లలో చేసిన పనులతో పాటు గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మహిళా అభ్యున్నతికి చేసే పనులను బిఆర్‌ఎస్ నాయకులు వివరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకొని ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనుల వివరాలు ప్రజలకు చేరేలా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నారు. ప్రచారానికి సోషల్ మీడియా విరివిగా ఉపయోగించుకుంటున్నారు. బూత్‌స్థాయి సమావేశాల్లో ప్రతి ఓటరును ప్రచారం ముగిసేలోపు మూడుసార్లు కలవాలని ముఖ్యనేతలు సూచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలో సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించుకొని ప్రచారంలో పట్టుజారకుండా అగ్రనేతలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
చిన్న పార్టీల మద్దతు కొరకు కాంగ్రెస్ యత్నం
ఇక కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టే వ్యూహాలను రచిస్తోంది. టికెట్ల ఖరారు కాస్త ఆలస్యమైనా ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చిన్నా చితక పార్టీలతో సంప్రదింపులు చేసి మద్దతు కూడగట్టుకుంటోంది. ఆ క్రమంలో షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్టీపి, కోదండరాం తెలంగాణ జనసమితి సంఘీభావం లభిస్తుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మూడు విడతల్లో టికెట్ రాని అసంతృప్తులను సముదాయిస్తున్న కాంగ్రెస్ పెద్దలు మిగతా పార్టీల మద్దతుపైనా దృష్టి సారించారు. పార్టీ తిరుగుబాటుదారులు, స్వతంత్రులు ఎక్కువగా పోటీ చేయకుండా బుజ్జగిస్తున్నా ఎక్కడికక్కడ అసంతృప్తులు రెబల్స్‌గా కొనసాగుతూనే ఉన్నారు.
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా…
కొంతమంది అసమ్మతిరాగాన్ని బాహాటంగానే ప్రకటిస్తున్న తరుణంలో వారు పార్టీ వ్యతిరేకంగా పనిచేయకుండా సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలోని నలుగురు సభ్యుల సమన్వయ కమిటీ పనిచేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పోటీకి విముఖత చూపగా వైఎస్‌ఆర్టీపీ, టిజేఎస్ మద్దతు పలకడం కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నింపుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండుసార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గద్దనెక్కాలన్న పట్టుదలతో పనిచేస్తోంది. కాంగ్రెస్ సైతం ప్రచారంలో పదేళ్లలో అమలు చేయని హామీలను ఏకరవు పెట్టడమే కాకుండా ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. సోషల్ మీడియాలోనూ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం నిర్దేశంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది.
జనసేన, కమ్మ ఓట్లపై బిజెపి గురి
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న ఓబిసిల ఓట్లను ఒడిసిపట్టే వ్యూహంతో బిజెపి పార్టీ బిసి నినాదాన్ని ఎత్తుకుంది. బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని ఇప్పటికే కమలం అగ్రనేత అమిత్‌షా ప్రకటించారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒకటి కాదన్న వాదనను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రతి విమర్శలకు పదనుపెడుతోంది. రాష్ట్రానికి పసుపు బోర్డు, వరంగల్‌లో టెక్స్‌టైల్స్ పార్క్, రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు ఎన్నో పథకాల ద్వారా నిధులు అందించినట్లు బిజెపి పార్టీ వివరించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా వెనకబడిన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. జనసేన రూపంలో బిజెపి సైతం సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లపై గురి పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News