Saturday, December 21, 2024

ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 810 తేదీల మధ్య వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ నెల 9న కచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల సంఘం శుక్రవారం భేటీ అయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించిన ఇసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని, చత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం బావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలోఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఇసి భావిస్తోంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమయిన చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. పోలింగ్ ప్రక్రియ నవంబర్ రెండో వారంనుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కాగా డిసెంబర్ 10 15తేదీల మధ్య ఓట్ల లెక్కింపు జరపాలని ఇసి భావిస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుండగా, మిజోరీం శాసన సభ పదవీ కాలం ఈఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధికారంలో ఉంది.

ధనబలాన్ని పూర్తిగా నియంత్రించాలి: సిఇసి
ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ అయిదు రాష్టారల కోసం ఎన్నికల సంఘం 1100 మందికి పైగా పరిశీలకులను నియమించనుంది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ఈ పరిశీలకుల బాధ్యత. పోలీసులు,వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో ఇసి శుక్రవారం సమావేశమయింది.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రలోభ రహిత ఎన్నికలను నిర్వహించేందుకు సమన్వయంలో పని చేయాలని, తద్వారా అందరికీ సమాన అవకాశాల వేదికను కల్పించాలని సిఇసి రాజీవ్ కుమార్ పరిశీలకులను ఆదేశించారు.

ఎన్నికల పరిశీలకులు తమ విధుల విషయంలో తటస్థంగా, నైతికంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ధనబలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని రాజీవ్ కుమార్ పరిశీలకులను ఆదేశించారు. దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించడం ద్వారా, అలాగే మారుమూల ప్రాంతాల గిరిజనులకు వారికి అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటి సదుపాయాలు కల్పించడం ద్వారా ఎన్నికల కమిషన్ మానవతా దృక్పథంతో వ్యవహరించడంపై దృష్టిపెడుతోందని కూడా ఆయన చెప్పారు. పరిశీలకులను ఎన్నికల కమిషన్‌కు ‘ కళ్లు, చెవులు’గా ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండేల, అరుణ్ గోయల్‌లు అభివర్ణిస్తూ, సోషల్ మీడియాపైనా నిఘా ఉంచాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News