Monday, November 18, 2024

‘పాంచ’జన్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఆరు మాసాల ముందు జరుగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 730 తేదీల మధ్య జరుగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3 న వెలువడనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద ఏ మేరకు వుంటుందనేది చెప్పలేము గాని, ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఎవరి ఖాతాలో చేరబోతున్నాయనేది కీలకం. మెజారిటీ విజయాలు సాధించుకోగలవారికి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విశేష బలం చేకూరుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ప్రధాన ఎదురెదురు పక్షాలుగా బిజెపి, కాంగ్రెస్ వున్నాయి. ఈ రెండింటిలో ఏ పార్టీది ఇక్కడ పైచేయి అవుతుందో చూడాలి. కర్నాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత బిజెపి స్థైర్యం తగ్గిన మాట వాస్తవం. అందుచేతనే మహిళా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నంలో వంట గ్యాస్ ధరల తగ్గింపు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కల్పన చర్యలను అది తీసుకొన్నది.

అయితే వాటిపరంగా కూడా ఆ పార్టీకి పూర్తి ప్రజా మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. వంట గ్యాస్ ధరలను కేవలం ఎన్నికల దృష్టితోనే తగ్గించినట్టు ప్రజలకు అర్థమైపోయింది. అలాగే ఇప్పట్లో అమలుకు నోచుకోని మహిళల రిజర్వేషన్ చట్టం కూడా ఆ వర్గాన్ని అంతగా సంతోషపెట్టే అవకాశాలు లేవు. అయినా ఈ రెండు చర్యలను తన ఘనతగా బిజెపి చాటుకొంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలు హిందీ మాట్లాడే రాష్ట్రాల ప్రజల మొగ్గును సూచించే అవకాశాలున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలున్నాయి. అక్కడ ఎన్నికలు నవంబర్ 23న జరుగుతాయి. గత (2018) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెలుచుకొన్నది. అంటే మెజారిటీకి దరిదాపుల్లో వచ్చింది. 39.8 శాతం ఓట్లను గెలుచుకొన్నది. బిజెపి 70 సీట్లను కైవసం చేసుకొన్నది. బహుజన సమాజ్ పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తిరిగి తన పార్టీని గెలిపించుకొనే ప్రయత్నంలో అప్రమత్తంగా పని చేస్తూ వచ్చారు. పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అయితే బిజెపి కూడా కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు గట్టి కృషి చేస్తున్నది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కాంగ్రెస్ ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసన సభకు పోలింగ్ నవంబర్ 17న జరుగుతుంది. ఇక్కడ కూడా పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్యనే. బిజెపి ఈ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ళుగా అధికారంలో వున్నది. ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను గెలుచుకొన్నది. 41.5 శాతం ఓట్లు సాధించుకొన్నది. బిజెపి 109 స్థానాలు, 41.6 % ఓట్లు పొందింది. సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్‌ది పైచేయి అయినందున బిజెపి ప్రతిపక్షంలో కూచొని వుంటే అది ప్రజాస్వామికం అనిపించుకొనేది.

కాని కాంగ్రెస్‌లో అసమ్మతి నాయకుడైన జ్యోతిరాదిత్య సింధియాను బయటకు రప్పించడం ద్వారా మెజారిటీని కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఈసారి బిజెపి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగినందుకు ఆయనను రాజకీయంగా బలి తీసుకొంటున్నారని బోధపడుతున్నది. 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 7న, 17న రెండు విడతల్లో జరగనున్నాయి. వామపక్ష తీవ్రవాదం సమస్య వల్ల ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరిపించడానికి నిర్ణయించారు. 15 ఏళ్ళ బిజెపి పాలన తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలు గెలుచుకొని దిగ్విజయంగా అధికారంలోకి వచ్చింది. బిజెపి కేవలం 18 సీట్లే గెలుచుకొన్నది. ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రభుత్వం తీసుకొన్న అనేక పేదల అనుకూల చర్యలు తనను తిరిగి అధికారానికి తీసుకు వస్తాయని కాంగ్రెస్ ధీమాగా వుంది. అయితే ఆయన ప్రభుత్వం మీద బిజెపి 104 పేజీల ఛార్జిషీట్ విడుదల చేసింది.

రెండు పరివర్తన యాత్రల ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు, ఆప్, హమ్ రాజ్ పార్టీలు దాని ఓట్లను చీలుస్తాయనే అంచనా బిజెపిని ఆశల్లో వుంచుతున్నది. నవంబర్ 30న పోలింగ్ జరగనున్న తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు గట్టి కృషి చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు బిఆర్‌ఎస్‌కు పునర్విజయాన్ని సాధించిపెడతాయని, ఆ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించగలదనే అంచనాలు వున్నాయి. 40 శాసన సభా స్థానాలున్న మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనున్నది. గత ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టిన మిజో నేషనల్ ఫ్రంట్ మయన్మార్ శరణార్థుల వివరాలు సేకరించే విషయంలో బిజెపితో విభేదించింది. మిజో జాతీయత మీద ఆధారపడి తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News