హైదరాబాద్ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీలు పాల్గొన్నారు. ఈ భేటీలో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరగా పని దినాలు కాదు, పని గంటలపై చూడాలని మంత్రి హరీశ్ రావు వారికి సూచించారు. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు పది బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉండగా, శుక్రవారం వరదలు, శనివారం పలు బిల్లులపై చర్చించనున్నారు.
20 రోజులు సమావేశాలు జరపాలి: భట్టి
సమావేశంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి సభ ఎన్ని రోజులు జరిగిందన్నది ముఖ్యం కాదనీ, ఎంత మంచి చర్చ జరిగిందన్నది ముఖ్యమని ఆయన బదులు ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతల మానసిక స్థితి దెబ్బతిందని మంత్రి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చ సజావుగా సాగేలా చూడాలని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి పేరిట చర్చ జరగనివ్వలేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు సభాపతికి అందజేత
సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను బిఆర్‌ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు సభాపతికి అందించాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలు, సంక్షేమ పథకాలపై సభలో చర్చించాలని బిఏసి సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో దాదాపు పది బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో గవర్నర్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులు, ఆర్టీసి ఉద్యోగులు, టిమ్స్ ఆసుపత్రులు, జీఎస్టీ చట్ట సవరణ, కార్మికశాఖకు సంబంధించిన బాయిలర్స్ చట్ట సవరణ బిల్లులను ఈ సభలో ప్రవేశపెట్టనున్నారు.
#Telangana monsoon session of assembly begins; BAC meeting decides session will be for only three days pic.twitter.com/mTPFhTf9Zx
— TNIE Telangana (@XpressHyderabad) August 3, 2023