Sunday, January 12, 2025

సభ సజావుగా జరిగేలా చూడండి: స్పీకర్ గడ్డం ప్రసాద్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) -రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎల అండ్ యుడి – దానకిశోర్, జిఎడి సెక్రటరీ రఘనంందన్ రావు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్, లా అండ్ ఆర్డర్ ఎడిజి మహేష్ భగవత్, ఫైర్ డిజి నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు -సివి అనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ ఐజి కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సోమవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయన్నారు.

గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని సూచించారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని తెలిపారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభకు, సభ్యులకు అందించాలన్నారు. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందించితే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయన్నారు. సభ్యులు సమయానికి సజావుగా శాసనసభకు చేరుకోవడానికి రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం నుండి జరిగే సమావేశాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నామన్నారు. జిల్లాల పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఉల్లంఘన జరుగుతుందని, ప్రోటోకాల్ విషయంలో వివాదాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

శాసనమండలి పరిసరాలలో చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదేనని, పొరపాట్లు జరగకుండా, సభ సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు. శాసన మండలి సమావేశాలు జరిగే సమయంలో అధికారులు తప్పక హాజరవ్వాలని, సమన్వయంతో రెండు సభలను సజావుగా నడిచేలా చూడాలన్నారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన సంఘటనలపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News