Wednesday, January 22, 2025

12నుంచి అసెంబ్లీ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సమయాత్తమవుతోంది. వారం రోజుల పాటు జరగనున్న సమావేశాలను ఎప్పటి నుంచి జరపాలనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగాప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి సమావేశాలను జరపాలన్న నిర్ణయానికి సిఎం కెసిఆర్ దాదాపు గా వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోం ది. 25వ తేదీ నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. అంతకంటే ముందుగానే సమావేశాలకు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగకు సంబంధిత వర్గం ప్రజలకు ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గిఫ్టులను కూడా అందజేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సోమవా రం (12వ తేదీ) నుంచి సమావేశాలను ప్రారంభించి 20వ తేదీలోగా సమావేశాలను ముగించడానికే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే ఒకటి, రెండ్రోజుల పాటు సమావేశాలను పొడిగించినా సరే.. ఇబ్బందులు తలెత్తకుండా సమావేశాలను ముగించనున్నారు.

కాగా అసెంబ్లీ సమావేశాల వేదికగా మరోసారి సిఎం కెసిఆర్ కేంద్రం విధానాలను ఎండగట్టనున్నారు. ముఖ్యంగా ఆర్ధిక అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022..20-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి సమకూరవలసిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్న విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ వివరించనున్నారు. అలాగే రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజలకు సవివరంగా వివరించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రానికి ఇచ్చే ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని రూ. 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించి….. దీనిని అకస్మాత్తుగా రూ.39వేల కోట్లకు కుదించింది.

తద్వారా రాష్ట్రానికి అందాల్సిన రూ.15 వేల కోట్ల నిధులకు గండిపడిన విషయాన్ని కూడా సిఎం కెసిఆర్ సభకు వివరించనున్నారు. ఇక కేంద్రం నుంచి చేయూత అందకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా నిధులను సమకూర్చుకోవడం కోసం అనేక ఆర్థిక సంస్థలతో ఒప్పందాలను చేసుకుంది. అయితే ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా కేంద్రం నిలిపివేయించింది. ఈ విషయాన్ని కూడా సభలో ఆయన వివరించనున్నారు.కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమైన బిల్లలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింప చేసుకోనుంది. ప్రధానంగా అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించిన బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. 1977 నాటి చట్టానికి పలు సవరణలతో పాటుమరిన్ని బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News