Friday, November 22, 2024

అగ్నికి ఆజ్యం పోస్తున్న పుకార్లు, తప్పుడు వార్తలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో 160 మందికి పైగా బలి తీసుకున్న గత మే 4న చెలరేగిన జాతుల హింసాకాండకు చాలా వరకు పుకార్లు, తప్పుడు వార్తలే కారణమని రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వివిధ భద్రతా ఏజన్సీల అధికారులు అంటున్నారు. చురుచంద్‌పూర్‌లో గిరిజనులు హత్య చేసినట్లుగా చెబుతూ పాలిథిన్ కవర్‌లో చుట్టిన ఓ మహిళ మృతదేహానికి చెందిన ఓ వీడియో మే 3న మణిపూర్ లోయలో వైరల్ కావడమే ఆ మర్నాడు (అంటే మే4న) ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంతో పాటుగా పలు లైంగిక దాడుల ఉదంతాలు చోటు చేసుకోవడానికి కారణమని వారు అంటున్నారు.

వాస్తవానికి ఆ మృతదేహం దేశ రాజధాని ఢిల్లీలో హత్యకు గురయిన ఓ మహిళకు చెందినదని ఆ తర్వాత తెలిసింది. అయితే అప్పటికే మణిపూర్‌లోయను చుట్టుముట్టిన మంటలు ఆ మరుసటి రోజు యావత్తు భారతావని సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఘటనలకు దారి తీసిందని ఆ అధికారులు అంటున్నారు. తప్పుడు ఫోటో కారణంగా దావానలంలా చెలరేగిన హింసాకాండ కారణంగా రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిలిపి వేయడానికి కారణమయిందని వారు చెప్పారు. ఇంటర్నెట్‌ను నిలిపివేయడాన్ని కొన్ని పార్టీలు, సామాజిక ఉద్యమకారులు వ్యతిరేకించాయి. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను పరిమితంగా పునరుద్ధరించాలని హైకోర్టు కూడా ఆదేశించింది.

దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోరు.. హైకోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని ఆదేశించింది. కాగా స్థానిక దినపత్రికల్లో సైతం సర్కులేట్ అవుతున్న తప్పుడు, లేదా ఏకపక్ష వార్తలపై ఎలాంటి కంట్రోల్ లేదని రాష్ట్రంలో విద్వేషాగ్నిని చల్లాచర్చడంలో నిమగ్నమైన వివిధ భద్రతా ఏజన్సీల విశ్లేషణలో స్పష్టమవుతోంది. చందేల్ జిల్లాలో ఆయుధాలు ధరించిన గిరిజనులు మెజారిటీ వర్గంపై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను దీనికి ఓ ఉదాహరణగా వారు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మణిపూర్ పోలీసులు రంగంలోకి దిగగా అది తప్పుడు వార్త అని తేలింది.

కొన్ని స్థానిక పత్రికల్లో వచ్చినట్లుగా ఏ గ్రామాన్ని తగులబెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని పేర్కొంటూ ఆ తర్వాత పోలీసులు ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అంతేకాదు సున్నితమైన కేసుల విషయంలో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రచురించాలని మరోసారి పత్రికలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలను కట్టడి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక ‘రూమర్ ఫ్రీ నంబర్’ను కూడ ఏర్పాటు చేశారు. చురుచంద్‌పూర్‌లో గిరిజనులు ఊరేగింపుగా వెళ్తున్నట్లుగా చూపే మరో వీడియో కూడా కొద్ది రోజలు క్రితం సర్కులేట్ అయింది. గిరిజనులు మెజారిటీ తెగకు చెందిన మహిళలు, పిల్లలను ఎత్తుకుపోతారని పేర్కొనే సబ్‌టైటిల్స్ కూడా అందులో చేర్చారు.

అయితే ఈ వీడియో మిజో భాషలో ఉండడంతో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు దీన్ని అలుసుగా తీసుకుని మైతీలను రెచ్చగొట్టే విధంగా వారి భాషలో సబ్‌టైటిల్స్‌ను ఉంచాయి. అయితే ఆ వీడియోలో వాస్తవానికి ఉన్నదేమిటంటే ప్రత్యేక పరిపాలనకు సంబంధించిన డిమాండ్‌తో పాటుగా ఓ గిరిజన గీతం మాత్రమే. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రతిరోజూ సర్కులేట్ అవుతూ ఉండడం వల్లనే రాష్ట్రంలో హింసాకాండకు దిగిన రెండు జాతుల మధ్య వైరం చల్లారడం లేదని ఆ అధికారులు అంటున్నారు. ఈ కారణం వల్లనే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుందని కూడా వారంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News