న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల స్వల్పస్థాయిలో పెరుగుతున్న కొవిడ్ కేసులు అధికారులలో కలవరానికి దారితీస్తున్నాయి. ఢిల్లీలోని స్కూళ్లలో పిల్లలకు వైరస్ సోకింది. సమీపంలోని నోయిడాలో కూడా పిల్లలకు వైరస్ వ్యాపించింది. అయితే కొవిడ్ కేసులలో పెరుగుదలకు ఏ రకం వైరస్ కారణం అనేది నిర్థారించాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో తలెత్తిన ఎక్స్‌ఇ వేరియంటు వల్ల కేసుల పెరుగుదల పరిణామం సంభవించిందా? అనేది ఇప్పటికిప్పుడు నిర్థారించలేమని దేశ ప్రముఖ బయోమెడికల్ సైంటిస్టు డాక్టర్ గగన్‌దీప్ కంగ్ గురువారం తెలిపారు. ఎక్స్ ఇ వల్లనే కేసులన్ని తలెత్తుతున్నాయని అనుకోవడానికివీల్లేదు. ముందుగా వైరస్ జన్యుక్రమం వరసను సరిగ్గా పరిశీలించుకోవల్సి ఉంటుంది. వ్యాధి కారకం ఏమిటనేది తరువాతనే తేటతెల్లం అవుతుందని వివరించారు.
అన్ని అంశాలను క్రోడీకరించుకున్న తరువాతనే పూర్తిస్థాయిలో తుది నిర్ణయానికి రావల్సి ఉంటుంది. కేవలం వైరస్ సోకిన వారి సంఖ్యను బట్టి ఇది ఏ వేరియంటు అనేది తేల్చడం కష్టం అవుతుంది. ఇంతకు ముందటి ఒమిక్రాన్‌కు తదనంతర రూపంగానే ఇప్పటి ఎక్స్‌ఇ వచ్చి చేరింది. ఎక్కువగా ఈ వైరస్ మనిషి ఎగువ శ్వాసకోశ వాహికపై చేరుతుంది. దీనితో ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. జ్వరం, తరువాత అలసట వంటివి కన్పిస్తాయి. ఇవి ఎక్కువగానే బాధిస్తాయి. అయితే ఇంతకు ముందటి వైరస్ తరహాలో ఇవి తీవ్రతర ప్రభావం చూపదు. ఆసుపత్రుల పాలు కావల్సిన అవసరం లేదు. కేవలం ఇంటికి పరిమితం అయితే సరిపోతుంది. కొవిడ్ నిబంధనలు పాటించాల్సి వస్తుంది.