డగ్వే : విశ్వం సృష్టి పరిణామాలను సంతరించుకుని ఉండే గ్రహశకలంలోని ముక్కను తీసుకుని నాసా క్యాప్సూల్స్ ఆదివారం ఉటా ఎడారిలో దిగింది. అక్కడ ఉటా మిలిటరీ టెస్ట్, ట్రైనింగ్ రేంజ్‌లోకి చేరుకుంది. అత్యంత క్లిష్టతరమైన భూ వాతావరణం నడుమ ఈ క్యాప్సూల్ నిర్ణీత ప్రదేశానికి చేరుకుంది. అస్టారాయిడ్ శకలాల అన్వేషణకు ఈ క్యాప్సూల్‌ను ఏడు సంవత్సరాల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కక్షలోకి పంపించింది. ఒసిరిస్ రెక్స్ మిషిన్‌లో భాగంగా పంపిన క్యాప్సుల్ నిర్ణీత ప్రదేశానికి చేరుకోవడం పూర్తి అయిందని నాసా ఈ ఘట్టం ప్రత్యక్ష ప్రసారం దశలో తెలిపారు. వీడియో వెబ్‌కాస్ట్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వెలువరించారు.
బిలియన్ మైళ్ల దూరంలోని బెన్నూ అస్టారాయిడ్‌కు ఏళ్ల తరబడి ఈ జర్నీ సాగిందని, ఇది ఇప్పుడు ముగిసిందని వ్యాఖ్యానించారు. బెన్నూ నుంచి శాంపుల్‌ను 2020లో సేకరించారు. ఇందులో దాదాపు 250 గ్రాముల ( తొమ్మిది ఔన్స్) శకలం భాగం ఉంది. అస్టారాయిడ్ ఉపరితలం నుంచి సేకరించిన దుమ్మూ ధూళిని తీసుకున్న క్యాప్సూల్ భూమికి లక్ష కిలోమీటర్ల దూరంలో వాహక నౌక నుంచి విడిపోయి , నాలుగు గంటల వ్యవధిలో భూమికి చేరుకుంది. ఇంతకు ముందు అస్టారాయిడ్స్‌కు సంబంధించి రెండు నమూనాలను జపానీ క్యాప్సుల్స్ తీసుకువచ్చాయి.