బ్రిటన్‌లో ట్రయల్స్ ఫలితాలపై పరిశోధకుల వెల్లడి
లండన్ : ఆక్స్‌ఫర్డ్ /ఆస్ట్రాజెనెకా తయారు చేసిన సిహెచ్‌ఎడిఆక్స్1 ఎన్ కొవ్ 19 వ్యాక్సిన్ బ్రిటన్ కరోనా కొత్త వేరియంట్ నియంత్రణలో సమర్థత చూపిస్తోందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఆగ్నేయ లండన్‌లో గత ఏడాది బయటపడిన కరోనా కొత్త వేరియంట్ బి.1.1.7 ‘కెంట్’నియంత్రణలో ఈ వ్యాక్సిన్ సమర్థత చూపించినట్టు పరిశోధకులు వివరించారు. బ్రిటన్‌లో నిర్వహించిన ఈ సిహెచ్ ఎడిఆక్స్1ఎన్ కొవ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్ డేటా ప్రకారం ఈ వ్యాక్సిన్ అసలు కరోనా మహమ్మారి నుంచి రక్షణ కలిగించడమే కాక, కొత్త వేరియంట్ బి.1.1.7 నుంచి కూడా రక్షణ కలిగిస్తుందని స్పష్టమైందని పెడియాట్రిక్ ఇన్‌ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ ప్రొఫెసర్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పోలర్డ్ వివరించారు.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికాలో వ్యాపించిన కరోనా వైరస్ వల్ల సంభవించిన తీవ్ర వ్యాధి నుంచి ఈ వ్యాక్సిన్ ఎంతవరకు రక్షణ కలిగిస్తుందో ఇంకా పరిశీలించ వలసి ఉందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. అయితే అధ్యయనం ముద్రణకు ముందు చిన్న నమూనాపై చేపట్టిన అధ్యయనం బట్టి ఈ వ్యాక్సిన్ సమర్థమైనదేనన్న నమ్మకాన్ని ఆస్ట్రాజెనెకా వెలిబుచ్చింది. ఇతర కరోనా వ్యాక్సిన్ల మాదిరి గానే ఈ వ్యాక్సిన్ కూడా యాంటీబాడీలను తటస్ఠీకరణ చేస్తున్నట్టు ఉదహరించింది.