ఐన్‌స్టీన్ ఊహ రుజువు చేసిన స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: భూమికి వంద మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణబిలం (ఐ జ్విక్వీ1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని (తేలికపాటి) స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీ (అమెరికా ) పరిశోధకులు గుర్తించ గలిగారు. సాధారణంగా కృష్టబిలాలు అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా ఖగోళ వస్తువులన్నిటినీ తమ లోకి ఆకర్షించుకుంటాయి. అయితే ఈ బిలాల వెనుక ఏముందో ఇంతవరకు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించ లేక పోయారు. ప్రముఖ జర్మన్ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కృష్ణబిలం వెనుక కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయని అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని జనరల్ రియాల్టివిటీ పేరుతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
అయితే దీన్ని రుజువు చేయడానికి గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిరూపించ గలిగారు. కాంతి ప్రతిధ్వనులు మెరుపుల్లా మొదలై ఆ తరువాత రంగురంగుల్లోకి మారిపోయాయి. సాధారణంగా కృష్ణబిలం లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముందో తెలియడం లేదు. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఈ గుట్టును విప్పగలిగారు. ఆ బిలం చుట్టేసినట్టు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఈ ఖగోళ అద్భుతంపై బుధవారం నేచర్ జర్నల్‌లో కథనం వెలువడింది.
Astronomers detect light behind black hole