పెషావర్ : పాకిస్థాన్‌లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం డేరా ఇస్మాయిల్‌ఖాన్ లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడికి తాము బాధ్యులమని ఏ ఉగ్రవాద వర్గం వెల్లడించలేదు. ఉగ్రమూకలు అన్ని వైపుల నుంచి పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్లు, భారీ తుపాకీ కాల్పులతో విరుచుకుపడ్డారని జిల్లా పోలీస్ అధికారి నసీర్ మెహమూద్ తెలిపారు.
ఉగ్రమూకలను పోలీస్‌లు ఎదిరించగా, తప్పించుకుపోయారని చెప్పారు. ఆ ప్రాంతమంతా పోలీస్‌లు దిగ్బంధం చేసి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఖైబర్ పక్తున్‌ఖ్వా , బెలోచిస్థాన్ ప్రావిన్స్‌ల్లో గత కొన్నాళ్లుగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆర్షాద్ హుస్సేన్ ఈ దాడిని ఖండించారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పిరికితనంతో సాగించే ఇలాంటి దాడులతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోలీస్ చర్యలను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.