Thursday, January 23, 2025

అఫ్గాన్‌లో పెను విషాదం

- Advertisement -
- Advertisement -

భారీ భూకంపం..
వెయ్యి మందికి పైగా మృతి

క్షతగాత్రులు 1500మంది పైమాటే
రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు గంటగంటకు
పెరుగుతున్న మృతుల సంఖ్య
పాక్‌లోనూ ప్రకంపనలు

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బుధవారం సంభవించిన పెను భూకంపంలో 1000 మందికి పైగా మృతి చెందగా, 1500 మందికి పైగా గాయపడ్డారు. గంటగంటకూ మృతుల సంఖ్య పెరిగిపోతుండడం చూస్తే ఈ భూకంపం ఎంతటి విపత్తును సృష్టించిందో అర్థమవుతుంది. ‘ మృతులసంఖ్య పెరుగుతూనే ఉంది.దాంతో వరసపెట్టి సమాధులను తవ్వాల్సి వస్తోంది’ అని స్థానిక అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.భూకంపం సంభవించిన ప్రాంతం మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సమాచార లోపం నెలకొంది. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత చాలా అంతర్జాతీయ సంస్థలు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడంతో సహాయ కార్యక్రమాలకు కూడా ఆటంకం కలుగుతోంది.దాంతో మరణాలపై పూర్తి స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు అనుకుని ఉన్న ఖోస్ట్, ఫక్టికా ప్రావిన్స్‌లో ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించినట్లు యుఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1పాయింట్లుగా నమోదైంది.

భూకంపం కేంద్రం పక్టికా ప్రావిన్‌లో ఉన్నట్లు పాక్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడి మీడియాలో వస్తున్న దృశ్యాలు భూకంపం తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. వందలాది ఇళ్లు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి. అవి ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఆ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా ప్రజలు సహాయం కోసం అర్థించే దుస్థితి నెలకొంది. హెలికాప్ట్టర్లలో సహాయక బృందాలను పంపించినప్పటికీ అది ఏ మూలకూ చాలడం లేదు. అంతర్జాతీయ సమాజం సహాయం కావాలని అఫ్గాన్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తాలిబన్ల ఆక్రమణతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలను ఈ భూకంప విపత్తు మరింత కష్టాల్లోకి నెట్టేసింది. 2002లో సంభవించిన పెను భూకంపం తర్వాత ఆ స్థాయిలో ప్రాణనష్టం చోటు చేసుకోవడం ఇప్పుడే. అప్పుడు సంభవించిన భూకంపంలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు.

పాకిస్థాన్‌లోనూ ప్రకంపనలు

భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోను ప్రకంపనలు సంభవించాయి. పెషావర్, ఇస్లామాబాద్,లాహోర్, ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా,పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News