యుపి హైవేపై 18 మంది మృతి
అత్యధికులు వ్యవసాయ కూలీలు
భారీ వర్షాలతో పరిస్థితి దారుణం
బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొని చొచ్చుకుపోయిన ఘటనలో కనీసం 18 మంది మృతి చెందారు. పాతిక మంది వరకూ గాయపడ్డారు. మృతులలో అత్యధికులు వ్యవసాయ కూలీలు. బీహార్ , పంజాబ్ వంటి దూర ప్రాంతాల నుంచి ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారికి మంగళవారం అర్థరాత్రి తరువాత జరిగిన ఈ ఘటన చావుమజిలీనే మిగిల్చింది. అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీహార్, హర్యానా, పంజాబ్ నుంచి 130 మందితో వస్తున్న ప్రైవేటు బస్సు యాక్సిల్ విరగడంతో లక్నో అయోధ్య హై వేలోని రామ్ సనేహీ గేట్ ప్రాంతంలో నిలిపి ఉంచారు. మరమ్మతుకు ప్రయత్నిస్తూ ఉండగా వేగంగా వచ్చిన బస్సు వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందినట్లు బుధవారం ఉదయం అధికారులు తెలిపారు.
ఈ బస్సు ప్రయాణికులలో కొందరు బసు దిగి పక్కన నిలబడి ఉన్నారు. మరికొందరు బస్సులోనే విశ్రాంతి తీసుకుంటుండగా ఘటన జరిగింది. 11 మంది అక్కడికక్కడే విలవిలలాడుతూ మృతి చెందారు. ఏడుగురిని ఆసుపత్రికి చికిత్సలకు తరలిస్తుండగా కన్ను మూశారు. ఈ ప్రాంతంలో భారీ వర్షం పడుతూ ఉండటం , ట్రక్కు అతి వేగం వంటి అంశాలు ప్రమాదానికి దారితీసినట్లు నిర్థారణ అయింది. వీడకుండా పడుతున్న వర్షాలతో సహాయక బృందాలు నానా ఇబ్బందులకు గురి కావల్సి వచ్చింది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారని, పూర్తిస్థాయిలో సహాయక చర్యలకు ఆదేశించారని లక్నోలో అదనపు చీఫ్ సెక్రెటరీ ( హోం ) అవనీష్ అవస్థీ తెలిపారు.