Thursday, January 23, 2025

పాపం పసివారు..

- Advertisement -
- Advertisement -

ఖాన్‌యూనిస్ : గాజాస్ట్రిప్‌లో అత్యంత దయనీయ మానవీయ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి ఇప్పుడు రోగులు, ఆశ్రితులు ఇజ్రాయెల్ సైన్యం రంగ ప్రవేశంతో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో నెలలు నిండకముందే పుట్టిన 30 మంది వరకూ అప్పుడప్పుడే కన్నుతెరుస్తున్న జీవులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వీరిని ఈ గాజా మాతృత్వపు నేల నుంచి పొరుగున ఉన్న ఈజిప్టుకు హుటాహుటిన తరలించేందుకు రంగం సిద్ధం అయింది. వారిని ఈజిప్టులోని వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు, ఆసుపత్రులకు తరలిస్తారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. కాంపౌండ్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించిన తరువాత పలువురు రోగులు ఎటూవెళ్లలేక, అక్కడ ఉండలేక దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఇటువంటివారిలో తీవ్రంగా గాయపడి చికిత్సకు వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరికి వెంటనే అవసరం అయిన చికిత్స అందాల్సి ఉంది. మరో వైపు నవజాతశిశువుల దీనావస్థను తెలిపే చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసి కలవరానికి దారితీశాయి. ఆసుపత్రి ఖాళీ కావడం, శిశువులు బయట చలిలో ఎటువంటి ఇంక్యూబేటర్లు లేని స్థితిలో ఉండటం వంటి దృశ్యాలు కలవరం కల్గించాయి.

అప్పుడే పుట్టిన ఈ శిశువులలో అత్యధికులు నెలలు నిండకముందే పుట్టిన వారు ఉన్నారు. వీరికి మరింత జాగరూకతతో కూడిన చికిత్స జరగాల్సి ఉంది. గాజాలో ఇప్పుడు పరస్పర దాడులు తప్పితే , ఎటువంటి చికిత్సలకు , సంరక్షణకు వీలు కాని పరిస్థితి ఉంది. దీనిని గుర్తించి ఇప్పుడు పసికందులను వెంటనే ఈజిప్టుకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. శనివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) బృందం ఆసుపత్రిని సందర్శించింది. ఇప్పటికీ 291 మంది రోగులు ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు పడుతున్న వైనం గుర్తించారు. 32 మంది శిశువుల పరిస్థితి విషమంగా ఉంది. వెన్నెముకలు దెబ్బతిని, కాళ్లు విరిగి, పలు గాయాలతో పడి ఉన్న రోగులు కదలలేని స్థితిలో నిశ్ఛేష్టులుగా ఉన్నారు. వెంటనే శిశువులను ఈజిప్టు ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు గాజా ఆరోగ్య విభాగం తెలియచేసినా, దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇతర సంస్థలు కానీ ధృవీకరించలేదు. రోగులకు సహాయం చేసేందుకు నిర్థిష్టమైన రీతిలో ఉండే సంకేతాలతో కూడిన వాహనాలతో పలు దేశాల నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది తరలివచ్చింది. సరిహద్దుల ఆంక్షలను అధిగమించి గాజాలోకి చేరుకున్న వీరి వాహనాలపై కూడా కాల్పులు జరిగాయి.

వైద్య సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి సన్నిహితుడు కాల్పుల్లో మృతి చెందాడు. కొందరు గాయపడ్డారని వెల్లడైంది. అల్ షిఫా ఆసుపత్రి నుంచి శనివారం ఉదయం దాదాపు 2500 మంది వరకూ రోగులు ఇతరులు బయటకు తరలివచ్చారు. రోగుల వెంబడి ఎంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా వైద్య సిబ్బంది వీడకుండా ఉంటోంది. వీరిని కాపాడేందుకు యత్నిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరో వైపు ఉత్తర, దక్షిణ గాజాల్లో ఇజ్రాయెల్ సేనలు తమ దాడులను ఉధృతం చేశాయి. అర్బన్ జబలియా శరణార్థుల క్యాంపుపై కూడా ఇజ్రాయెల్ సైనిక దాడులు జరిగినట్లు, దీనితో ఈ ఐరాస సహాయక శిబిరం దెబ్బతిన్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News