వారం రోజులు గాలింపు తర్వాత శిథిలాల కిందినుంచి
10 మందిని కాపాడిన సహాయక బృందాలు
బీజింగ్: మధ్య చైనాలో వారం రోజుల క్రితం కూలిన నివాస భవనంలో మృతి చెందిన వారి సంఖ్య 53 కు చేరుకుంది. భవన శిథిలాల గుట్టల కింద ప్రాణాలతో ఉన్న పది మందిని సహాయక బృందాలు కాపాడాయి. శుక్రవారం తెల్లవారు జామున చిట్టచివరి వ్యక్తిని కూడా కాపాడినట్లు, దీంతో జాడతెలియకుండా ఉన్న అందరి లెక్క తేలిందని అధికారులు విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీన చాంగ్‌షాలోని వాణిజ్య దుకాణాలతో పాటుగా పౌరనివాసాలు కూడా ఉన్నబహుళ అంతస్థుల భవనం ఒక్క సారిగా కూలిపోయింది. ఇతర భవనాల మధ్య ఈ భవనం ఇరుక్కు పోయి ఉండడంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి సహాయక బృందాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి జాడ తెలుసుకోవడానికి సహాయక బృందాలు పోలీసు కుక్కలు, చేతి పరికరాలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ లైఫ్ డిటెక్టర్లు లాంటి పరికరాలను వాడాల్సి వచ్చింది. అయిదున్నర రోజుల పాటు శ్రమించి పది మందిని కాపాడారు. శుక్రవారం తెల్లవారు జామున చిట్టచివరగా ఒక మహిళను శిథిలాల కిందనుంచి కాపాడారు. కాపాడిన అందరు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలతో భవన యజమాని సహా పది మందిని అరెస్టు చేశారు.