Saturday, December 21, 2024

కనీసం నా అంత్యక్రియలకైనా రండి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే భావోద్వేగ ప్రసంగం

బెంగళూరు : “మీకోసం పనిచేయలేదని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి” అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భావోద్వేగంతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక లోని తన స్వంత కాలబురిగి జిల్లా లోని అఫ్జల్‌పూర్‌లో బుధవారం ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కాలబురిగి నియోజక వర్గం నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమాని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, సిటింగ్ ఎంపి ఉమేష్ జాదవ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ ఇస్తున్నారు. “ మీరు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయకుంటే ఇక్కడ నాకింక ఎలాంటి చోటు లేదని భావిస్తాను. ఇక మీ హృదయాలను సాధించలేను.

మీరు కాంగ్రెస్‌కు ఓటేసినా, వెయ్యికపోయినా, కాలబురిగికి ఏదైనా చేశానని భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి.” అని ఆయన ప్రజలను వేడుకున్నారు. బీజేపీని, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని ఓడించడానికి తన ఆఖరి శ్వాసవరకు రాజకీయాల్లో కొనసాగుతానని ఖర్గే స్పష్టం చేశారు. రాజకీయాల కోసమే నేను పుట్టాను. ఏదేమైనా ఎన్నికల్లో పోటీ చేస్తాను. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రాణమున్నంత వరకు పోరాడతాను, అంతవరకు రాజకీయాల నుంచి రిటైర్ కాబోను ” అని ఖర్గే స్పష్టం చేశారు.

వేదికపై ఉన్న ముఖ్యమంత్రి ‘సిద్ధరామయ్యను ఉద్దేశిస్తూ ‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా పదేపదే అదే చెబుతుంటాను. ముఖ్యమంత్రి లేదా ఎమ్‌ఎల్‌ఎగా రిటైరైనా సరే బీజేపీని, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని ఓడించేవరకు రాజకీయాల నుంచి రిటైర్ కావద్దు అని ”ఖర్గే పేర్కొన్నారు. కాలబురిగి లోక్‌సభ స్థానం నుంచి 2009. 2014లో విజయం సాధించిన ఖర్గే 2019లో ఓడి పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News