Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో  రూ. 14.2 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బురిండి దేశం నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణీకురాలి వద్ద నుంచి 14.2 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ అధికారులు వెల్లడించిన వివరాలీవిధంగా ఉన్నాయి. బురిండి దేశానికి చెందిన 43 సంవత్సరాల మహిళ ఆదివారం రాత్రి నైరోబీ నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఎయిర్ వేస్ ఫ్లైట్ (నెంబర్ జీ9-458)లో హైదరాబాద్ వచ్చింది. అయితే, ఆమె లగేజ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉండటంతో కస్టమ్స్ అధికారులు అనుమానించారు. దీంతో సదరు మహిళ లగేజీ తనిఖీ చెయ్యగా 8 ఆఫ్రికన్ సాంప్రదాయ దుస్తులు, హ్యాండ్ బ్యాగ్, మూడు సబ్బులు లభ్యమయ్యాయి.

దుస్తుల గుండీల కవర్లను కట్ చేసి చూడగా హెరాయిన్ బయట పడింది. దాంతోపాటు హ్యాండ్ బ్యాగ్, సబ్బుల నుంచి కూడా హెరాయిన్‌ను అధికారులు గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసు కున్నారు. సదరు మహిళ డ్రగ్స్ తరలించేందుకు వేసిన ఎత్తులను చూసి కస్టమ్స్ అధికారులు విస్తుపోయారు. మొత్తం రెండు కిలోల ఇరవై ఏడు గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేసిన అధికారులు, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 14.2 కోట్ల రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మహిళా ప్రయాణీకురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News