విదేశాల్లో స్థిరపడి జన్మభూమి రుణం తీర్చుకోవడం అభినందనీయం
రవీంద్రభారతిలో జరిగిన ఆటా సభలో మాజీ మంత్రి హరీష్ రావు
మెట్రోలో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు ప్రయాణం
ప్రయాణికులతో సరదాగా ముచ్చటించిన హరీష్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆటా సంస్థ తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలు అందిస్తోందని, విదేశాల్లో స్థిరపడిన మన తెలుగు ప్రజలు తమ మూలాలను మర్చిపోకుండా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రవీంద్రభారతిలో అమెరికల్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు ఇచ్చిన పిలుపును మన తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారని, అమెరికాలోని 10 లక్షల మంది తెలుగు ప్రజలు తమ సంప్రదాయాలను, కళలు మర్చిపోకుండా కొనసాగించడం అభినందనీయమన్నారు. అంతే కాకుండా వేల మైళ్ల దూరంలో ఉన్న సాటి తెలుగు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
33 ఏళ్లుగా ఆటా సంస్థ తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి సేవ చేయడం ఒక ఎత్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడడం మరో ఎత్తు, ఆటా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల10 నుంచి 30వ తేదీ వరకు 20 రోజుల పాటు ఆటా వేడకల్లో భాగంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించిందన్నారు. బిజినెస్, ఎడ్యుకేషన్ సెమినార్లు, విద్యార్థులకు వీసాలపై అవగాహన, స్కాలర్ షిప్పులు, స్కూళ్లలో కంప్యూటర్లు, డిజిటల్ సామగ్రి, పేదలకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. మారుమూల అచ్చంపేట నల్లమల అడవుల్లోని చెంచు ప్రజలకు దుప్పట్లు, దుస్తులు అందించి పెద్ద మనసు చాటుకున్నఅందరికీ అభినందలు తెలిపారు.
ఎక్కడి అమెరికా, ఎక్కడి అచ్చంపేట ఈ బంధాన్ని కలిపింది మన తెలుగు భాష, సంస్కృతి అన్నారు. వనపర్తి, సిద్దిపేట, గజ్వేల్, బాచుపల్లి, తిరుపతి, వైజాగ్ ఎన్నో చోట్ల వాటర్ ప్లాంట్లు, ఆరోగ్య శిబిరాలు సొంత ఖర్చులో నిర్వహించడం తెలుగు నేలపై మీకున్న ప్రేమకు నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. రెండు మెట్లు పైకెక్కిన వాళ్లు తమకంటే కింద వాళ్లను, తమతో కలిసి జీవించినవాళ్లను ఆదుకోవడమే అసలైన ధర్మం. ప్రభుత్వ కార్యక్రమాలకు తోడుగా ఇలాంటి సంస్థలు కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణకు పెట్టుబడులు రావడానికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయం, బాసర ఐఐటీతో ఆటా కుదుర్చుకున్న ఎంఓయూ విద్యార్థుల భవిష్యత్తకు బంగారు బాట వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రసాదం చేయడం అభినందనీయమని, రాజేంద్ర ప్రసాద్ అనే ఓ నటుడు మనకు లేకుంటే తెలుగు వెండితెరపై నవ్వులు ఇంతగా పూచేవి కావుని ఆయన తెలుగువారి చార్లీ చాప్లిన్‌ని పొగిడారు. హాస్యం మన జీవితంలో బరువును తగ్గిస్తుందని, ఆరోగ్యకర హాస్యం ఆలోచింపజేస్తుందన్నారు. రాజేంద్ర ప్రసాద్ హాస్యం ప్రత్యేకమైనది రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ఎవరికి వాళ్లే గొప్పవాళ్లు కానీ వాళ్లు హీరోలు కాదు రాజేంద్ర ప్రసాద్ హీరో ఒక పాత్రలో హీరో షేడ్‌ను, కమెడిన్ షేడ్‌ను అద్భుతంగా పండిచడం ఆయనకే చెల్లిందన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ అధ్యక్షుడిగా ఆయన తనతోటి ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించారని,ఆయనను ఆటా లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉందని ఆయనకు ఆటా నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో కేంద్ర ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణరెడ్డి, నటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మెట్రోరైల్ ప్రయాణించిన మాజీ మంత్రి హరీష్ రావు: నాగోల్‌లోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు అదే సమయంలో రవీంద్రభారతిలో నిర్వహించే ఆట కార్యక్రమానికి రావడానికి ఆలస్యం అవుతుండటంతో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి సరదాగా పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు.