న్యూఢిల్లీ: యువతలో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు రానున్న ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. ఆమె వరుసగా 14వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రపంచ నైపుణ్యం పెంచేందుకుగాను ఐదు జాతీయ కేంద్రాలను కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, ఉన్నత విద్య కోసం భారతీయ భాషల్లో డిజిటల్ బుక్స్‌ను అందించేందుకుగాను ‘భారతీయ భాషా పుస్తక్ స్కీమ్’ను ఆరంభించనున్నట్లు తెలిపారు. ఐదు ఐఐటిలలో అదనంగా మౌలిక వసతులను ఏర్పాటుచేయబోతున్నట్లు వివరించారు.
దేశంలో పౌష్టికాహారంను ప్రోత్సాహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది దేశవ్యాప్తంగా ఆవిష్కరణ, వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రధాన చొరవ. దీనిని 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఏర్పాటుచేశారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఎంఎస్‌ఎంఈ, పరిశ్రమ స్థాయిలలో జోక్యాల ద్వారా దేశవ్యాప్తంగా ఆవిష్కరణ, వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థను సృష్టించడం అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్షం.