ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో బుధవారం ప్రమాదం సంభవించి 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం. ఈ రాష్ట్రంలో దశాబ్దకాలం తరువాత జరిగిన భారీ ప్రమాదం ఇదే. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీకయి, ఎలక్ట్రిక్ ప్యానల్‌పై ద్రావకం పడడంతో అత్యధిక ఉష్ణోగ్రతతో సాల్వెంట్ మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. ఆంధ్రలో ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రమాదాలు గత కొన్నేళ్లుగా సంభవిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదనడానికి ఇప్పటి ప్రమాదం ఒక ఉదాహరణ. 1997లో విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో ప్రమాదం సంభవించి 60 మంది చనిపోయారు. 2012లో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విస్ఫోటనం సంభవించి 19 మంది చనిపోయారు.
2013లో హెచ్‌పిసిఎల్‌లో పేలుడుకు 28 మంది బలయ్యారు. 2020లో విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌లో సెరీన్ వాయువు లీకై 12 మంది చనిపోయారు. 2020లో విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డులో క్రేన్ విరిగి కుప్పకూలి 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ సమీపాన పరవాడలో లారస్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదానికి నలుగురు మృతి చెందారు. ఈ విధంగా గత దశాబ్ద కాలంలో విశాఖ పరిశ్రమల్లోనే అత్యధికంగా ప్రమాదాలు జరగడం శోచనీయం. ముఖ్యంగా రసాయన పరిశ్రమల్లో ఆయా రసాయనాలు ఎంతటి ప్రమాదకరమైనవో అంచనా వేయకుండా పరిశ్రమల్లో వినియోగించడం, నిల్వ చేయడం జరుగుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఏయే చర్యలు తీసుకోవాలో కొన్ని పరిశ్రమల్లో పాటించడం లేదు. ఉదాహరణకు 2020 మేలో ఎల్‌జి పాలిమర్స్ ప్లాంట్‌లో సెరీన్ వాయువు లీకైనప్పుడు 12 మంది చనిపోయారు. ఆ సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో సంయుక్త పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది.
ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్షం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నివేదిక వెల్లడించింది. ఫ్యాక్టరీలో ఎయిర్ కండిషనర్లు, అత్యధిక ఉష్ణోగ్రతలు, రసాయనాలపై తీవ్రమైన ఒత్తిడి తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచించారు. 2022 అక్టోబర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన భద్రతా ప్రమాణాలను అమలులోకి తెచ్చింది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు గత కొన్నేళ్లుగా భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నా సరిగ్గా అమలు కావడం లేదు. 2020 మే నుంచి 2021 జూన్ వరకు దేశంలోని రసాయన, గనుల పరిశ్రమల్లో 116 ప్రమాదాలు జరిగి 230 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ 19 లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత పరిశ్రమలు తిరిగి పని చేయడం ప్రారంభమై 2020 మే నుంచి డిసెంబర్ వరకు 64 ప్రమాదాలు జరిగి 118 మంది కార్మికులు మృతి చెందారు. 2021 జనవరి నుంచి జూన్ వరకు పరిశ్రమల్లో 52 ప్రమాదాలు జరిగి, 117 మంది కార్మికులు మృతి చెందారు. 142 మంది గాయపడ్డారు. ఇవన్నీ మీడియా కథనాలు, కార్మిక సంఘాల నుంచి అందిన సమాచారం బట్టి తేలిన గణాంకాలు.
వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగించే సమస్య. అయినా ఈ ప్రమాదాలు సరిగ్గా నమోదు కావడం లేదు. మెటీరియల్స్, పరికరాలు, ఎక్విప్‌మెంట్, పని వాతావరణం, ఉద్యోగం, ఉద్యోగం చేసే విధానాలు, తదితర అంశాలతో కూడిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికుల సమన్వయ భాగస్వామ్యం దోహదం చేస్తుంది. ఇందులో అంచెలంచెల ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. కానీ ఈ విషయంలో వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న పారిశ్రామిక భద్రతా చట్టాలు వందేళ్ల క్రితం నాటివి. ఇవి ఆయా పరిశ్రమలకు భద్రత కల్పిస్తాయి.
కార్మికుల జీవితాలకు హామీ కల్పిస్తాయి. కానీ ఈ విషయంలో ఇంకా ఆందోళన చెందవలసిన పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల దేశంలో 139 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించి 259 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, 560 మంది గాయపడ్డారని నేషనల్ డైజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌ఎండిఎ) వెబ్‌సైట్ పేర్కొంది. ఈ పారిశ్రామిక ప్రమాదాలు ఎందుకు ఎలా జరుగుతున్నాయో, దీనికి మూలకారణాలేమిటో సమగ్రంగా విశ్లేషించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించవలసి ఉంది. దానివల్ల కార్మికులకు భద్రత చేకూరుతుంది. వృత్తిపరమైన భద్రత, కార్మికుల ఆరోగ్యరక్షణతో కూడిన నిబంధనలను 2019లో కేంద్రం రూపొందించినప్పటికీ, కార్మిక సంఘాలు సంతృప్తి చెందడం లేదు. దీనికి కారణం నిబంధనలను పరిమితం చేయడం, భారీ కార్మిక రంగాన్ని విస్మరించడం. పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తుండడంతో కార్మిక భద్రత నిబంధనల చట్టాలు కూడా మారిపోతున్నాయి.