Monday, January 20, 2025

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత వారం టివి లైవ్‌లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురికావడాన్ని దేశంలో చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు తగిన శిక్ష అంటూ సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తున్న ప్రతివారు ‘అతిక్‌పై నాకు ప్రేమ లేదు’ అంటూ ప్రారంభిస్తున్నారు. కానీ అది కాదు అసలు విషయం. అత్యంత భయంకరమైన నేరస్థుడికి కూడా రాజ్యాంగపరంగా 21వ అధికరణం ప్రకారం రక్షణ ఉంది. చట్టం ద్వారా నిర్దేశించిన ప్రక్రియల ద్వారా తప్ప రాజ్యాం గ రక్షణలను ఏ వ్యక్తి కూడా కోల్పోరాదని మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్పష్టం చేస్తుంది. చట్టబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వంలో పని చేసే అధికార యంత్రాంగమైన ఇటువంటి రాజ్యాంగ రక్షణలను కాపాడటం వారి ప్రాథమిక కర్తవ్యం. అతిక్ వంటివారు ఎటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన్నప్పటికీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ద్వారా, అటువంటి వారిని నిర్మూలించడం ద్వారా కాకుండా మన మేధస్సును, సామర్ధ్యాలను బలమైన విచారణకు దారి తీసే విధంగా ఉపయోగించుకోవాలి.

తన పాలనలో కరడుగట్టిన నేరస్థులు ఉంటె జైళ్లలో ఉండాలి లేదా రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని యోగి ఆదిత్యనాథ్ పలు సార్లు స్పష్టం చేశారు. లేని పక్షంలో పోలీస్ ఎన్‌కౌంటర్‌లకు గురికావాల్సిందే అని సంకేతం ఇస్తున్నారు. ఇప్పటికే 180 మందికి పైగా ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందారు. మాఫియాను మట్టిలో కలిపేస్తానని ఉత్తరప్రదేశ్ శాసన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మాటను నిలబెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చట్టబద్ధంగా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఏమి చేసినా సంకుచిత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పక్షపాతంతో వ్యవహరించినట్లే కాగలదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ కొన్ని సామాజిక వర్గాలకు చెందిన గ్యాంగ్ స్టార్‌లు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చట్టాన్ని కాపాడే పేరుతో చట్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం చట్టబద్ధ పాలన నిర్వీర్యం కావడానికి దారి తీస్తుంది.

అప్పటికే అతిక్ తనపై విచారణ జరిపి దోషిగా నిర్ధారించబడిన నేరానికి జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే, ఇప్పుడు ఇంకా విచారించని నేరానికి చంపబడడం భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పవచ్చు. మనం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? నిరంకుశ పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. పోలీసులు ఎన్‌కౌంటర్‌లో అతిక్ కుమారుడిని చంపిన వైనం అట్లా ఉంచితే, అతిక్‌ను మాత్రం టివి కెమెరాల ముందు దారుణంగా చంపివేయడం ‘రక్షణ న్యాయం’ గానే భావించాలి. జర్నలిస్టుల ముసుగులో చంపిన ముగ్గురు యువకులు కూడా చిన్న చిన్న నేరాలతో అల్లరిగా తిరిగేవారుగా కనిపిస్తున్నారు. లక్షల రూపాయల విలువైన తుపాకీలు సమకూర్చుకొని, అతిక్ వంటి వారిని హత్య చేయవలసిన అవసరం వారికి ఉండదు. హత్య జరగ్గానే వారిని పట్టుకున్న పోలీసులు కనీసం ఏమి జరిగిందో విచారించడానికి నిందితులను తమ కస్టడీకి కోరకుండా జ్యుడీషియల్ కస్టడీకి పంపివేయడం గమనిస్తే అంతా ఒక పథకం ప్రకారం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. గూండారాజ్, గ్యాంగ్‌స్టర్‌లను అంతమొందించామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పదేపదే చేస్తున్న వాదనలను కూడా ఇటువంటి సంఘటనలు సవాల్ చేస్తున్నాయి.

తన పాలనలో కరడుగట్టిన నేరస్థులు ఉంటె జైళ్లలో ఉండాలి లేదా రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని యోగి ఆదిత్యనాథ్ పలు సార్లు స్పష్టం చేశారు. లేని పక్షంలో పోలీస్ ఎన్‌కౌంటర్‌లకు గురికావాల్సిందే అని సంకేతం ఇస్తున్నారు. ఇప్పటికే 180 మందికి పైగా ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందారు. మాఫియాను మట్టిలో కలిపేస్తానని ఉత్తరప్రదేశ్ శాసన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మాటను నిలబెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చట్టబద్ధంగా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఏమి చేసినా సంకుచిత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పక్షపాతంతో వ్యవహరించినట్లే కాగలదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ కొన్ని సామాజిక వర్గాలకు చెందిన గ్యాంగ్ స్టార్‌లు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చట్టాన్ని కాపాడే పేరుతో చట్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం చట్టబద్ధ పాలన నిర్వీర్యం కావడానికి దారి తీస్తుంది.

మరోవంక, ఇటువంటి గ్యాంగ్ స్టార్‌లు రాజ్యమేలడానికి దారితీస్తున్న పరిస్థితులను, వారిని ప్రేరేపిస్తున్న రాజకీయ, అధికారిక శక్తులను మట్టుపెట్టకుండా కొద్ది మందిని చంపి వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకొంటే పొరపాటు కాగలదు. ఉదాహరణకు అతిక్‌కు అటు రాజకీయ పార్టీలలో, ఇటు పాలనా యంత్రంగంలో బలమైన పట్టులేకుండా ఇటువంటి నేరస్థ సామ్రాజ్యాన్ని సుదీర్ఘ కాలం ఏర్పర్చుకొనే అవకాశం ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతల అవినీతి సొమ్ములకు అతను రక్షణ కల్పిస్తున్నాడు. విదేశాలలో వాటిని భద్రంగా దాస్తున్నాడు. ఎన్నికలలో వారికి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుత యుపి మంత్రులలో సహితం అటువంటి వారున్నారు. నేటి ఎంపిలలో 40 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తమ అఫిడవిట్ లలో పేర్కొన్నారు.

మంత్రులలో సహితం పరిస్థితి అదే విధంగా ఉంది. నేర చరిత్ర గలవారికి, అవినీతి చరిత్ర గల వారికి పార్టీలలో గాని, ప్రభుత్వంలో గాని ఎటువంటి పదవులు ఇవ్వమని, ఎన్నికలలో సీట్లు ఇవ్వమని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటించగలదా? ప్రకటించినా ఆచరింపగలదా? హత్య, అత్యాచారం వంటి హీనమైన కేసులు గల వారికి సహితం ఎన్నికలలో సీట్లు ఇస్తున్నారు. మంత్రి పదవులు ఇస్తున్నారు గదా. పైగా, గుజరాత్ జైలు నుండి ఉత్తరప్రదేశ్ జైలుకు మారుస్తున్నప్పుడే తనకు అక్కడ ప్రాణ హాని ఉందని అతిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడం, పది రోజులలో చనిపోతాడని ఒక సీనియర్ పోలీస్ అధికారి ముందుగానే తనకు చెప్పాడని అతని న్యాయవాది పేర్కొనడం గమనిస్తే ‘ఆటవిక రాజ్యం’లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది.

1970ల నుండి, రాజకీయ హింస క్రమంగా భారత దేశంలోని రాజకీయ జీవితంలో, పార్టీల అతీతంగా వ్యవస్థీకృతం అవుతుంది. ఈ విషయంలో ఏ ప్రభుత్వం, రాజకీయ పార్టీ అతీతులు కారని చెప్పవచ్చు. గతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న జమ్మూకశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, కొంత కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహితం నిత్యం హింసాకాండకు కేంద్రంగా ఉంటూ ఉండెడివి. దేశంలో తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని దాదాపుగా అదుపు చేశామని హోం మంత్రి అమిత్ షా చెబుతున్న సమయంలో సరికొత్త హింసాయుత వాతావరణం రాజ్యమేలుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలలో శాంతి భద్రతలు అదుపులో ఉండటం లేదు.

నేడు ఉత్తరప్రదేశ్‌లో నేరస్థులను అంతమొందించే పేరుతో జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యలు మన దేశంలో కొత్తగా జరుగుతున్నవి కావు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సలైట్లను అంతమొందించే పేరుతో జరిగాయి. అప్పుడు మనం చూసాము. పోలీసులు చంపేవారిలో మూడొంతుల మంది సాధారణ, అమాయక ప్రజలు. అట్టడుగు వర్గాలకు చెందినవారు. కేవలం నక్సలైట్లకు ఆతిథ్యం ఇచ్చారనో, వారు చెప్పిన పని చేశారనో.. ఏవో కుంటిసాకులతో చంపేవారు. ఆ తర్వాత కశ్మీర్, పంజాబ్, ఈశాన్య ప్రాంతాలలో ఇటువంటి ‘ప్రభుత్వ హత్యలు’ విచ్చలవిడిగా జరిగాయి. ఈ విధంగా రాష్ట్రాలలోని భద్రతా యంత్రాంగం, ముందుగా భద్రత పేరుతో తమ అధికారాలను విస్తరిస్తుంది.

జవాబుదారీతనం లేకుండా వ్యవహరించగలుగుతుంది. తర్వాత నెమ్మదిగా హింస, ఎన్‌కౌంటర్‌లను సర్వసాధారణం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి క్రూరత్వం, నిరంతర హింస సాధారణ ప్రజలను ప్రభుత్వాలకు దూరం చేస్తుంది. వారిలో తిరుగుబాటు ధోరణులు పెంచుతుంది. ఎపి అటవీ ప్రాంతాలలో అదే విధంగా జరిగింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం తగ్గుతున్నప్పటికీ సాధారణ పరిస్థితులు ఎందుకు రావడం లేదు? గత 30 ఏళ్ళల్లో భద్రతా దళాలు విచారణ పేరుతో ఇంటి నుండి తీసుకెళ్లిన సుమారు రెండు లక్షల మంది యువకులు అదృశ్యమయ్యారు. వారేమయ్యారు? సమాధానం చెప్పేవారు లేరు. వారంతా పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాదులుగా మారారా? కశ్మీర్ లోయలోనే ఉగ్రవాదులుగా కొనసాగుతున్నారా? లేదా జైళ్లలో ఉన్నారా? లేదా భద్రతా దళాలు మట్టుపెట్టాయా? అని రోధిస్తున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. చివరకు రాజకీయ నాయకత్వం సహితం ఇటువంటి పరిస్థితుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని దుస్థితి ఏర్పడుతుంది.

ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రతి నిరంకుశ పాలన ఇటువంటి మార్గంలో ప్రయాణించింది. చివరకు సామాజిక భవనం వారిపై కూలిపోయే వరకు కొనసాగుతాయని గమనించాలి. ప్రజాస్వామ్యాలు సమాజాలు స్థిరమైన చట్టబద్ధత, వివిధ ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్న అత్యంత సంక్లిష్టమైన నిబంధనలను సృష్టించడం ద్వారా నెమ్మదిగా అటువంటి మార్గంలోకి జారిపోతుంటాయి. కేవలం న్యాయాన్ని అందించడానికి చట్టబద్ధమైన పాలన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే ప్రజలకు శాంతి, సౌభాగ్యాలను అందించగలదని పాలకులు గుర్తించాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వలన కలిగే దుష్పరిమాణాలు మన సమాజంపై దీర్ఘకాలం కొనసాగుతాయని, ప్రమాదకర ధోరణికి దారితీస్తాయని గుర్తించాలి. చట్టబద్ధ పాలన అందించలేమని తమ అసమర్ధతను గుర్తించిన ప్రభుత్వాలే ఇటువంటి ‘ఆటవిక పద్ధ్దతు’లకు పూనుకొంటాయి.

 చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News