Monday, December 23, 2024

సాక్షి ఉమేశ్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ లాయర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్ (యుపి) : ఉమేశ్ పాల్ హత్య కేసులో మాజీ ఎంపీ, డాన్ అతీక్ అహ్మద్ లాయర్ విజయ్ మిశ్రాను పోలీస్‌లు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో సాక్షి ఉమేశ్‌పాల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడే హంతకులకు చేరవేసినట్టు తేలింది. బీఎస్‌పీ ఎమ్‌ఎల్‌ఎ రాజుపాల్ హత్య కేసులో ఉమేశ్ ప్రధాన సాక్షి. అతడిపై అతీక్ అహ్మద్ కుమారుడు, మరికొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఉత్తరప్రదేశ్‌ను కుదిపేశాయి. వాస్తవానికి హత్యకు ముందు ఉమేశ్‌పాల్ లొకేషన్‌ను లాయర్ విజయ్ మిశ్రానే హంతకులకు చేరవేసినట్టు తేలింది. దీంతో పోలీస్‌లు శనివారం లఖ్‌నవు లోని హోటల్ హయత్ లెగస్సీపై దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆనాడు విజయ్ నుంచి సమాచారం అందుకున్న హంతకులు ఉమేశ్ ఇంటివద్దనే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై యుపి అసెంబ్లీలో పెను దుమారం రేగింది. అనంతరం అతీక్ అహ్మద్, మరో నిందితుడిని పోలీస్‌లు ఎన్‌కౌంటర్ చేశారు.

కుమారుడి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే అతీక్ అహ్మద్, అతడి సోదరుడిని ముగ్గురు యువకులు పోలీస్‌ల సమక్షం లోనే కాల్చి చంపారు. లాయర్ మిశ్రా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో మే 21 న ప్లైవుడ్ వ్యాపారి నుంచి రూ. 3 కోట్లు డిమాండ్ చేసి బలవంతంగా వసూలు చేసిన కేసులో కూడా నిందితుడేనని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపక్ భూకర్ చెప్పారు. ప్రయాగ్‌రాజ్ లోని అత్తర్‌సుయా పోలీస్ స్టేషన్‌లో కూడా లాయర్ మిశ్రాపై కేసు నమోదై ఉంది. దన్యాబాద్ నుంచి వచ్చిన వ్యాపారి సయీద్ అహ్మద్ ముథిగంజ్‌లో షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. తన దగ్గర నుంచి మిశ్రా 1.20 లక్షల విలువైన వస్తువులు అరువుపై తీసుకెళ్లి అప్పు తీర్చలేదని ఫిర్యాదు చేశాడు. మిశ్రా సయీద్‌కు ఫోన్ చేసి అతిక్ పేరుపైన రూ. 3 కోట్లు డిమాండ్ చేశాడని సయీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉమేశ్‌పాల్ హత్య కేసులో అహ్మద్ భార్య పర్వీన్ కూడా నిందితురాలిగా ఉంది. ఆమె ప్రస్తుతం పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News