- ఇలాంటి యాగాలు చరిత్రలోనే జరగలేదు: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు: తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నివాసంలో అతిరుద్ర మహా యాగం కన్నుల పండుగగా కొనసాగుతోంది. నాలుగవరోజు రాఘవేంద్ర కాలనీలో ఎమ్మెల్యే నివాసంలో శ్రీ రాజ్యశ్యామల, శతచండి, సౌర,లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మాహాయాగం వైభవంగా కొనసాగుతోంది.
గురువారం షటస్థల బ్రహ్మ శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు న్విహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరులో నిర్వహించే ఇలాంటి యాగాలు దేశ చరిత్రలో ఎక్కడా జరిగిన్నట్లు పురణాల్లో కూడా లేదని ఫీఠాదిపతులు చెప్పడం అభినందనీయమన్నారు. తాండూరు ప్రాంతం సుభిక్షంగా, సురక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, ఉద్యోగాలు రావాలని, వ్యాపారాలు బాగా జరగాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తాండూరులో 11వేల మంది పుణ్యదంపతులతో యాగం చేపడుతున్నట్లు వివరించారు.
మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది దంపతులు యాగంలో కూర్చోడానికి వస్తున్నారని అన్నారు. మరో వారం రోజులపాటు జరిగే అతిరుద్ర మాహాయాగానికి 20వేల నుంచి 30వేల మంది దంపతులు వచ్చినా అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతి కుల సంఘాలకు, సమాజాలకు, అధికారులకు, నేతలకు పేరు పేరునా ఆహ్వానించడం జరిగిందన్నారు. ఒక వేళ ఎవరైనా ఆహ్వానం అందకపోతే ఇక్కడికి వచ్చి స్పాట్ బుకింగ్ చేసుకుంటే యాగంలో పాల్గొనే ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు యాగంలో హోమం చేపట్టడంతోపాటు వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు, అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు.
యాగానికి సిఎం కేసిఆర్ దంపతులు తప్పక వస్తారు
తాండూరులో నిర్వహించే అతిరుద్ర యాగానికి సిఎం కేసిఆర్ దంపతులు తప్పని సరిగా వస్తారని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. యాగానికి వస్తున్నట్లు రెండు రోజుల ముందు తెలియడం జరుగుతుందన్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు, నేతలు యాగానికి హాజరు అవుతారని సూచించారు.