Thursday, September 19, 2024

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రిగా తనకు ‘బృహత్తర బాధ్యత’ అప్పగించినందుకు ఆప్ నేత ఆతిశీ మంగళవారం తన ‘గురు’ అర్వింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. బిజెపి అవరోధాల నుంచి ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తాను కేజ్రీవాల్ ‘మార్గదర్శనం’లో పని స్తానని ఆతిశీ వెల్లడించారు. షీలా దీక్షిత్ (కాంగ్రెస్), సుష్మా స్వరాజ్ (బిజెపి) తరువాత ఆతిశీ ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి తనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన కొన్ని గంటల తరువాత ఆతిశీ మాట్లాడుతూ, తనకు ఇది ఆనందం, విచారం కలగలిసిన క్షణం ఇది అని పేర్కొన్నారు. ప్రజాదరణ పొందిన సిఎం కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నందున తనకు ‘ఇది విచారకరం’ అని ఆమె అన్నారు, కేజ్రీవాల్ తన నివాసంలో శాసనసభా పక్షం సమావేశంలో ఆతిశీ పేరును ప్రతిపాదించారు. ఆప్ ఎంఎల్‌ఎలు ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదనను ఆమోదించారు. సమావేశం అనంతరం విలేకరులతో ఆతిశీ మాట్లాడుతూ. వచ్చే కొన్ని నెలల పాటు తాను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగవలసి ఉన్నాయి. కానీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. ఎక్సైజ్ విధానం కుంభకోణం కేసులో బెయిల్‌పై గత శుక్రవారం తీహార్ జైలులో నుంచి విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ రెండు రోజుల తరువాత ఢిల్లీ సిఎంగా రాజీనామా చేస్తానని ఆదివారం ప్రకటించడమే కాకుండా ప్రజలు తనకు ‘నిజాయతీ సర్టిఫికేట్’ ఇచ్చేంత వరకు సిఎం పదవిని అధిష్ఠించబోనని శపథం చేశారు. ‘ఢిల్లీ పాపులర్ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నందున నాకు, ప్రజలకు ఇది తీవ్ర విచార క్షణం’ అని ఆతిశీ మంగళవారం చెప్పారు. తనను అభినందించవద్దని, తనకు పూల దండలు వేయవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వశాఖలు నిర్వహిస్తున్న ఆతిశీ తనపై నమ్మకం ఉంచినందుకు, కొత్త ముఖ్యమంత్రిగా ‘బృహత్తర బాధ్యత’ను తనకు అప్పగించినందుకు తన ‘గురు’ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ‘తొలిసారి రాజకీయవేత్త ముఖ్యమంత్రి కావడం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో, అర్వింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో మాత్రమే సాధ్యం. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. నేను ఏ ఇతర పార్టీలోనైనా ఉండి ఉంటే కనీసం ఎన్నికల టిక్కెట్ కూడా వచ్చి ఉండేది కాదు’ అని ఆమె అన్నారు.

కేజ్రీవాల్ తనను నమ్మి, ఒక ఎంఎల్‌ఎను, ఆ తరువాత మంత్రిని, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని చేశారు అని ఆతిశీ చెప్పారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ‘ఏకైక ముఖ్యమంత్రి అని ఆమె ఉద్ఘాటిస్తూ, బిజెపి గత రెండు సంవత్సరాల్లో ఆయనను వేధించిందని, ఆయనపై కుట్రలు పన్నిందని, అవినీతి ఆరోపణలు చేసిందని, ‘తప్పుడు’ కేసు నమోదు చేయించి, ఆరు వారాల పాటు ఆయనను జైలు పాలుచేసిందని ఆరోపించారు. ఆతిశీ ఆప్ సుప్రీమోను కొనియాడుతూ, ప్రజలు నిజాయతీపరుడినని ప్రకటించేంత వరకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించరాదని నిర్ణయించడం ద్వారా దేశంలోనే కాకుండా, ప్రపంచంలో కూడా మరే నాయకుడూ చేయలేనిది చేశారని అన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అటువంటి త్యాగానికి మరే ఉదాహరణా ఉండబోదు’ అని ఆతిశీ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు బిజెపి ‘కుట్ర’పై ఆగ్రహంతో ఉన్నారని, కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని ఆతిశీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News