వచ్చే నెల నుంచి క్యాష్ విత్‌డ్రాలపై చార్జీల మోత
న్యూఢిల్లీ : బ్యాంక్ ఎటిఎం వినియోగదారులకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) షాక్ ఇచ్చింది. వచ్చే నెల(జనవరి) నుంచి ఎటిఎం ఉచిత లావాదేవీలు పరిమితి మించినట్లయితే చార్జీల మోత భరించాల్సి ఉంటుంది. 2022 జనవరి 1 నుంచి నగదు, నగదు రహిత ఎటిఎం లావాదేవీలు ఉచిత నెలవారీ పరిమితిని మించినట్లయితే చార్జీలను పెంచేందుకు గత జూన్‌లో ఆర్బిఐ బ్యాంకులకు అనుమతిచ్చింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ ఓ ప్రకటన జారీ చేసింది. ఆర్బిఐ నిబంధనల మేరకు వచ్చే ఏడాది (2022) జనవరి 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల్లో ఉచిత పరిమితి దాటి ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తే రూ.21తో పాటు జిఎస్టి చెల్లించాలని బ్యాంక్ ప్రకటించింది.
కొత్త ఎటిఎం లావాదేవీ చార్జీలు
జనవరి నుంచి బ్యాంక్ కస్టమర్లు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి మించినట్లయితే రూ.21 +జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పరిమితి మించి లావాదేవీలకు రూ.20 వసూలు చేస్తున్నారు. అధిక ఇంటర్చేంజ్ ఫీజులను భరించేందుకు, ఇతర ఖర్చులు పెరిగిన దృష్టా బ్యాంకులు చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు ఆర్బిఐ తెలిపింది. ఈ కొత్త చార్జీలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బిఐ తన సర్కులర్లో పేర్కొంది.