Saturday, November 23, 2024

‘సంక్షేమంలో’ మనమే ‘టాప్’

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు కేంద్ర మంత్రులు ఇస్తున్న కితాబులే ఇందుకు సాక్షం పరిశ్రమలంటే
టాటాలే కాదు తాతాల నాటి కులవృత్తులు కూడా గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న
పథకాలు దేశంలో మరెక్కడా లేవు రూ. 11వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేస్తున్న ఏకైక
రాష్ట్రం యాదవ,కురుమల ఆత్మీయ సభలో మంత్రి కెటిఆర్ ధర్మం వైపు నిలబడే జాతి
గొల్ల కురుమలని మంత్రి హరీశ్‌రావు ప్రశంస

మనతెలంగాణ/హైదరాబాద్: పరిశ్రమలు అంటే టాటాలు, బిర్లాలు, ఆదానీలు మాత్రమే కాదని….. తాతలనాటి కులవృత్తులు కూడా బాగుంటే దేశం కూడా బాగుంటుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. అందుకే కు లవృత్తులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోసిన ఏకైన ప్రభుత్వం టిఆర్‌ఎస్సేనని అన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి కోసం, రాష్ట్రాభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు రూ.11వేల కోట్లతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్నారన్నారు. గొల్ల కురుమల కోసంఇంతపెద్దమొత్తంలో వెచ్చిన రాష్ట్రం దేశం లో మరోటి లేదన్నారు. ఆ ఘనత ఒక్క టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.మన్నగూడలో నిర్వహించిన యా దవ – కురుమల సభలో రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావుతో కలిసి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం రాక ముందు రాష్ట్రంలో గొల్ల కురుమల పరిస్థితి, కులవృత్తికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండేది? తెలంగాణ వచ్చిన తరువాత ఎలా బాగా అయిందో ఒకసారి ఆలోచించాలన్నారు.

గతంలో రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో మెంబర్లుగా ఉండేదన్నారు. కానీ ఈ రోజు ఆ సంఖ్య ఏడు లక్షల 61 వేలకు పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్ సింగ్ పలుమార్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రశంసించారన్నారు. బయటి వాళ్లు వచ్చి చెబితేనే తప్ప మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదన్నారు. గొల్ల కురుమ సోదరుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలు దేశంలో మరెక్కడ అమలు కావడం లేదన్నది వాస్తవమన్నారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరపాలన్న గొల్ల కురుమల డిమాండ్ ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అలాగే సదర్ పండుగను అధికారికంగా జరిపే డిమాండ్‌ను కూడా నెరవేరుస్తుందన్నారు.

ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురుమ

హరీశ్ రావు మాట్లాడుతూ, ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురుమలని ప్రశంసించారు. ఆనాడు న్యాయం ధర్మం పాండవుల వైపు ఉండి శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టారన్నారు. అలాగే గతంలో ఏ సిఎం చేయని రీతిలో మన గొల్ల కురుమల కోసం కెసిఆర్ ఆత్మగౌరవం నిలబెట్టారన్నారు. ఆర్థికంగా మరింత పరిపుష్టిని కల్పించారన్నారు. ఐఎఎస్, ఐపిఎస్ కన్నా గొప్ప తెలివితేటలు ఉన్న వారు గొల్ల కురుమలని అసెంబ్లీలోనే కెసిఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తు చేశారు. గొర్రపిల్లల కోసం గత ప్రభుత్వాలు ఎన్‌సిడి కింద అప్పు ఇచ్చారన్నారు. కానీ టిఆర్‌ఎస్ హయంలో 75 గొర్ర పిల్లలను సబ్సిడీతో ఇస్తోందన్నారు. అలాగే ప్రభుత్వంలో, చట్ట సభల్లో, రాజ్యసభలో ఇలా గొప్పగా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారన్నారు. ఇంత చేసిన కెసిఆర్‌కు వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరముందన్నారు. కర్నాటకలో అప్పటి కాంగ్రెస్ మంత్రి రేవణ్ణ…ఈ గొర్రెల స్కీం చూసి ఆశ్చర్యపోయారన్నారు.. తాను కాంగ్రెస్ లోఉన్నా.. కెసిఆర్ కలవాలని భావిస్తున్నా అని చెప్పి కర్ణాటక నుండి హైదరాబాద్‌కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి కెసిఆర్‌ను సన్మానించారన్నారు. ఈ ఘనత రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి నేతలకు కనపడం లేదని మండిపడ్డారు.

కురుమ, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు నెలల్లో అని ప్రారంభం కానున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్ నేతలు నోరుతెరిసే భారీ డైలాగులు చెబుతున్నారని…బిసిలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిసిలపై అంత ప్రేముంటే…. కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖను ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎలా ఉన్నయంటే….. హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని కెసిఆర్ పెడితే, దానిపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారన్నారు. ఎన్నికలు కాగానే డబ్బులు పోతాయని దుష్ప్రచారం చేశారన్నారు. కాని 24 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు అయిందన్నారు. ఇవాళ మన అక్కౌంట్లలో కురుమలకు గొర్రెలు కొనుక్కోవాలని డబ్బులు వేయించారన్నారు. ఇవి కూడా రావని…. సీజ్ అవుతయని జూటా మాటలు చెపుతున్నారని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపఎన్నిక ముగిసిన (ఐదవ తేదీ) తర్వాత ఎప్పటి లాగా మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునేలా అవకాశం ఉంటుందన్నారు.

రైతులకు ఉచిత కరెంటుతో పాటు, రైతు బంధు, రైతు బీమా తెచ్చింది టిఆర్‌ఎస్సేనని అన్నారు. మరి కేంద్రంలో ఉన్న బిజెపి చేసింది ఏమిటని నిలదీశారు. గతంలో ఉన్న గ్యాస్ సిలండర్ ధర రూ. 400 నుంచి రూ. 1200లకు పెంచిందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెడతమంటున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న తనకు కేంద్రం నేరుగా ఉత్తరం పంపిందన్నారు. ఇలా చేస్తే ఐదేళ్లకు రూ. 30 వేల కోట్ల ఇస్తమని చెప్పినప్పటికీ కెసిఆర్ ఒప్పుకోలేదన్నారు. కొద్ది మంది జూటామాటలు, పూటకోమాట మాట్లాడే వారు వస్తుంటారని….. అట్టి బట్టెబాజ్ గాళ్లకు , జూటేబాజ్ గాళ్లకు మునుగోడులో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ధర్మాన్ని నిలబెట్టాల్సిందిగా ఆయన కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News