Sunday, December 22, 2024

అట్రాసిటీ కేసుల్లో పారదర్శకంగా విచారణ చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: అట్రాసిటీ కేసుల్లో పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై కేసులు నమోదు చేయడం, త్వరితగతిన విచారణ చేపట్టి దోషులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కేసుల విచారణకు వచ్చే అధికారులకు సహకరించాలని, తద్వారా విచారణ సజావుగా జరుగుతుందన్నారు.

యువత చెడు అలవాట్లకు లోను కాకుండా, చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలు, అధికారులు, పోలీసుల సహకారంతో సామాజిక దృక్పథంతో స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 262 అట్రాసిటీ కేసులకు రూ.2.27 కోట్ల పరిహారం చెల్లింపునకు గాను 47 మందికి రూ. 54.37 లక్షలు చెల్లించడం జరిగిదన్నారు.

మిగతా 215 కేసులకు రూ.1.73 కోట్లు చెల్లించాల్సి ఉందని, బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ మంత్రి, కార్యదర్శులను కలిసి కోరుతానన్నారు. సివిల్ రైట్స్ డేలను నిర్వహించాలని, హత్య కేసులకు సంబంధించిన కుటుంబాల బాధితులకు కోరిన విధంగా సహకారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యాలయాల్లో డ్రాపవుట్‌లు లేకుండా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చట్ట ప్రకారం విచారణ వేగవంతం చేయాలని, తప్పుడు కేసులు లేకుండా విచారణ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. 215 మంది బాధితులకు రూ.1.73 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు.

జిల్లాలో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, హత్యకు గురై మరణించిన కుటుంబాల వారికి ఉపాధి, ఇళ్లు, వ్యవసాయ భూములు మంజూరు చేయాలని పలువురు సభ్యులు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్, జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, ఆర్‌డిఓలు మాధురి, వినోద్‌కుమార్, డిఎస్‌పిలు రవీందర్‌రెడ్డి, రాజశేఖర్‌రాజు, డిఎస్‌సిడిఓ రాజ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News