Monday, December 23, 2024

పసి పిల్లలపై వ్యాధుల దాడి

- Advertisement -
- Advertisement -

ఆరోగ్య సమస్యలు చిన్నారులను కలవరపెడుతున్నాయి. తల్లిదండ్రులు, వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందుతున్నాయి. చలి కాలంలో మొదలయ్యే సీజన్ మార్పుల కారణంగా జ్వరాలు, మీజిల్స్, హ్యాండ్ ఫుట్ మౌత్ (హెచ్‌ఎఫ్‌ఎం) వంటి వ్యాధులు భయపెడుతున్నాయి. కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో పిల్లల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో రెస్పిరేటరీ వైరల్ ఇన్‌ఫెక్షన్లకు చిన్నారులు గురవుతున్నారు. గాల్లో ప్లూ వైరస్ చేరి తుమ్ములు, జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. చల్లటి వాతావరణం వైరస్‌కు అనువైనది కావడంతో పాటు వాహన కాలుష్యంతోడై రోగ కారకమైన వ్యాధులను అంటగడుతున్నాయి. ఇందులో నిమోనియా ప్రధానమైనది. ఊపిరితిత్తులకు వచ్చే ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరస్ లేదా రెండూ గాని ఎపిడకిల్ ఆర్గానిజవ్‌‌సు వల్ల నిమోనియా సోకుతున్నది. దీని కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో తీవ్రంగా బాధపడుతున్నారు.

ఇక దోమల ద్వారా సంభవిస్తున్న మలేరియా కారణంగా ప్రతి నిమిషం ఒక చిన్నారి మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని నివారణకు ఆర్‌టిఎస్, ఎస్ టీకాలను తూచా తప్పకుండా వాడుక చేయడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని సూచించింది. జీవన శైలి వ్యాధులు కూడా పిల్లలపై పంజా విసురుతున్నాయి. డయాబెటిక్, బిపి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పిల్లలు సతమతమవుతున్నారు. 19 ఏళ్లలోపు పిల్లల్లో ఒక్క శాతం మంది డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. అదే వయసు వారిలో ప్రతి పది మందిలో ఒకరు ప్రీ డయాబెటిక ఉన్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. 7 శాతం మంది కిడ్నీ వ్యాధులతో, 5 శాతం మంది బిపితో బాధపడుతున్నారు. పాఠశాలకు వెళ్లే వారిలో 3 శాతం, 10 నుంచి 19 ఏళ్ల వారిలో 4 శాతం మంది కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. 04 ఏళ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది తక్కువ బరువు ఉంటున్నారు. 59 ఏళ్ల పిల్లల్లో 22.7 శాతం, 10 19 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో ఐరన్ లోపం ఉంటుంది. ఇదే వయసు వారిలో 5.7 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. విటమిన్‌ఏతో ఇబ్బందులు పడుతున్నవారు కూడా అధిక సంఖ్య లో ఉన్నారు. ఈ పరిస్థితులకు అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

వివిధ రకాల వ్యాధులతో పిల్లలు అర్ధాంతరంగా రాలిపోతున్నారు. 2015లో మన దేశంలో 2.51 కోట్ల మంది శిశువులు జన్మించగా, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 12.01 లక్షల మంది వేర్వేరు కారణాలతో మరణించారు. ప్రతి వెయ్యి ప్రసవాలకు సగటున 47.41 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు మరణిస్తున్నారు. ఇందులో నవజాత శిశువు (028 రోజులు) మరణాలు 6.96 లక్షలు (57.9 శాతం) ఉన్నట్లు అంచనా. ప్రపంచ దేశాలన్నింటిలోకి మన దేశంలోనే ఈ గణాంకాలు అధికం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల సంఖ్య పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో 39.68 శాతంగా నమోదైంది. చిన్నారుల మరణాలకు నిమోనియా, డయేరియాలే ప్రధాన కారణం. ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్నా… నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా ఏటా మాతా శిశు మరణాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ర్టంలో మాతాశిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన పథకాల కారణంగా గత ఐదేళ్లలో నవజాత శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. 2000 సంవత్సరంలో దేశంలో 25.16 లక్షల మంది చిన్నారులు ఐదేళ్లలోపు మరణించిగా 2015కి వచ్చేసరికి ఆ సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. 2022 నాటికి మరింతగా తగ్గి ఊరటనిచ్చింది.
కొవిడ్ విజృంభణతో ప్రభుత్వాలు, పరిశోధకులు, మందుల కంపెనీలన్నీ వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించాయి. ఈ క్రమం లో అంటువ్యాధులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించింది. దీంతో ఏడాదిలోపు వయసు పిల్లలకు పొంగు (మీజిల్స్), రుబెల్లా వ్యాధులు రాకుండా ఇచ్చే ఎంఆర్‌సివి టీకా కార్యక్రమం వెనకబడింది.

దద్దు, తట్టు వంటి పేర్లతో పిలిచే పొంగు వ్యాధితో చాలా మంది పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. 2019లో దేశీ యంగా 10,430 మందికి తట్టు వ్యాధి సోకింది. 2020లో 5,604, 2021లో 5,700 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ఆంక్షలు ఎత్తివేశాక 2022 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే అత్యధికంగా 9,489 మంది పిల్లలు తట్టు వ్యాధికి గురయ్యారు. 2022 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పొంగు కేసులు మన దేశంలోనే వెలుగు చూసినట్లు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసి) తెలిపింది. కొవిడ్‌ను అరికట్టే కృషిలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు వ్యాక్సిన్ వేయడంలో తలమునకలైనందున సార్వత్రిక టీకా కార్యక్రమానికి విఘాతం కలిగింది. దీంతో కోరింత దగ్గు, ధనుర్వాతం, పొంగు వ్యాధులతో పిల్లలు సతమతమవుతున్నారు. 2021లోనే మన దేశంలో రెండు కోట్ల మంది పిల్లలకు మీజిల్స్ టీకాలు అందలేదు. 2022 లో కేరళ, మహారాష్ర్టల్లో మీజిల్స్ కేసులు అధికంగా నమోదయ్యాయి.

ముంబాయి మహా నగరంలో ఎక్కువ మంది పిల్లలు పొంగు వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా అధికంగా కేసులు కనిపించాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆయా రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
పెద్దలకే పరిమితమైన జీవనశైలి వ్యాధులిప్పుడు కొవిడ్ తెచ్చిన ముప్పుతో పిల్లలపై ప్రభావం చూపుతోంది. క్షయ, టిబి, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులకు గురవుతున్నారు. సీసం దుష్ర్పభావాలతో ఏటా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువ హాని కలుగుతోంది. దీని ప్రభావంతో పిల్లల్లో దుందుడుకు స్వభావం, చిరాకు పెరిగిపోవడంతో పాటు తెలుసుకోవాలనే సామర్ధ్యం, ప్రజ్ఞ తగ్గిపోతున్నాయి. పెద్దలు, పిల్లలు కలిపి ఏటా 60 వేల మందికి పైగా టిబి కోరలో చిక్కుకుంటుండగా, 8 శాతం మంది 15 ఏళ్లలోపు వయస్సు పిల్లలుండడం గమనార్హం. 2022వ ఏడాదిలో బాధితుల సంఖ్య 64 వేలుండడం ఆందోళనకు దారితీస్తోంది. హైదరాబాద్ నగరంలో 15 శాతానికి పైగా పిల్లలు క్షయకు గురవుతున్నారు. మెదడువాపు వ్యాధి కూడా పిల్లల పాలిట శాపంగా మారింది.

మెదడులోని నాడి కణాలలో వాపు ఏర్పడి వాటి పని తీరులో అవరోధాలు ఏర్పడుతున్నాయి. దీంతో వివిధ లక్షణాలతో పిల్లలు ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఏటా సుమారుగా 2030 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మయోపియా వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. 5 15 ఏళ్ల వయసులో 17 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయివ్‌‌సు) తెలిపింది. కీళ్ల సమస్యలు ఒకటి, రెండేళ్ల పిల్లల్లో కనిపిస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరు కీళ్ల సబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగిన క్లీనికల్ రుమటాలజీ సదస్సులో వెల్లడయ్యింది. పిల్లల్లో తలెత్తుతున్న వ్యాధులను గుర్తిస్తూ వెంట వెంట చికిత్స అందించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొగ్గ దశలోనే వ్యాధిని నివారించడానికి వీలుంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

కోడం పవన్‌కుమార్- 9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News