Monday, December 23, 2024

కల్లోల ‘లంక’

- Advertisement -
- Advertisement -

 

Attack of Mahinda supporters on the people

శ్రీలంకలో మరింత క్షీణస్థితి
రణరంగమైన ప్రధాని నివాస ప్రాంతం
జనంపై మహీందా మద్దతుదార్ల దాడి
కాల్పులు జరిపిన ఎంపి శవమయ్యారు
ఘటనల తరువాత పిఎం రాజీనామా
నిరవధిక కర్య్ఫూ… భగ్గుమన్న ఉద్రిక్తత
ఆల్‌పార్టీ ప్రభుత్వానికి దేశాధ్యక్షుడి చర్యలు

కొలంబో : శ్రీలంకలో సోమవారం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభ స్థితిలో ఉన్న దేశాన్ని రక్షించలేని ప్రభుత్వ రాజీనామాకు వెల్లువెత్తిన నిరసనకారులపై ప్రధాన మంత్రి మహీందా రాజపక్సా మద్దతుదారులు ఆయుధాలతోదాడికి దిగారు. కర్రలతో బాదారు. ఈ క్రమంలో వారికి సారధ్యం వహించిన అధికార పార్టీ ఎంపి అమరకీర్తి జనంపై తన గన్‌తో కాల్పులు జరిపారు. తరువాత కొద్దిదూరంలో ఆయన మృతదేహం కన్పించింది. వేలాది మంది ప్రధాని అధికారికనివాసం టెంపుల్ ట్రీస్ వద్దకు చేరి శాంతియుత ప్రదర్శనలకు దిగుతుండగా, ప్రధాని నివాసంలో నుంచి వచ్చిన ఆయన మద్దతుదారులు సాయుధులై వారిపై దాడికి దిగారు. పార్లమెంట్ సభ్యులు అయిన అమరకీర్తి అతుకోరాల జనంపైకి కాల్పులు జరిపారు. ఓ వైపు వందలాది మంది ప్రధాని మంత్రి మద్దతుదార్ల దాడికి గాయపడి ఆసుపత్రుల పాలు అయిన దశలోనే ఎంపి కాల్పులకు దిగడంతో ఈ ప్రాంతం అట్టుడికిపోయింది.

ఎంపి జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఈ ఎంపి నిట్టంబువా ప్రాంతంలో ఓ భవనంలో తనను కాపాడుకునేందుకు యత్నించాడు. అయితే తరువాత ఆయన అక్కడనే చనిపోయి పడి ఉండటం గమనించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఎంపిపై జనం తిరగబడ్డారా? లేదా ఏం జరిగిందనేది స్పష్టం కాలేదు. తన నివాసం సమీపంలోనే జరిగిన అత్యంత భయానక పరిణామాల తరువాత ప్రధాని మహీందా రాజపక్సా తమ పదవికి రాజీనామా చేశారు. అత్యయిక స్థితి దేశంలో పలు ప్రాంతాలలో ఘర్షణలు , కర్ఫూ మధ్య ఆయన ఎట్టకేలకు పదవి నుంచి వైదొలిగారు. దేశంలో దిగజారిన ఆర్థిక పరిస్థితికి బాధ్యత వహిస్తూ అధ్యక్షులు గొట్టాబాయ రాజపక్సా సారధ్యపు ప్రభుత్వం గద్దెదిగాలని ఉధృత స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రులంతా వైదొలిగారు. అయితే ప్రధానిగా గొట్టాబాయ సోదరుడు మహీందా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, నిరసనలు హింసాకాండలతో పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రధాని ఓ ట్వీట్ వెలువరించారు. తరువాత కొద్ది సేపటికే ఆయన తమ రాజీనామాను ప్రకటించారు. ఆయన రాజీనామా పరిణామంతో దేశంలో కొత్త మంత్రిమండలి ఏర్పాటు అవసరం ఏర్పడుతుంది.

ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పదవి నుంచి వైదొలగాలని రెండు మూడు రోజుల క్రితమే తమ సోదరుడు మహీందాను ఓ ప్రత్యేక సమావేశంలో కోరారు.ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కొన్ని చర్యలు తీసుకుంటే తప్ప దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని ఇరువురు చాలా సేపటి వరకూ జరిగిన మంతనాలలో అభిప్రాయపడ్డారని ది డైలీ మిర్రర్ పత్రిక తెలిపింది. దేశంలో అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటు దిశలో ఇక ప్రెసిడెంట్ చర్యలు తీసుకుంటారు. పార్లమెంట్‌లోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించి వారితో చర్చించి ఆల్‌పార్టీ కేబినెట్ ఏర్పాటు తద్వారా దేశంలో సంక్షోభ నివారణకు దిగుతారని భావిస్తున్నారు. ప్రధాని రాజీనామా లేఖను దేశాధ్యక్షులు రాజపక్సాకు పంపించారని పిఎం అధికార ప్రతినిధి రోహన్ వెలివిటా ప్రకటించారు. దీనితో దేశంలో సరికొత్తగా యూనిటి ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుందని మహీందా ఆశించినట్లు ఈ ప్రతినిధి తెలిపారు. తాను తక్షణం రాజీనామా చేస్తున్నట్లు , దీనితో దేశాధ్యక్షులు సకాలంలో ఆల్‌పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నట్లు ప్రధాని పదవికి రాజీనామా లేఖలో మహీందా తెలిపారు. మరో వైపు దేశంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడటంతో అధికారులు నిరవధిక కర్ఫూ విధించారు. ప్రదర్శనలపై ఉక్కుపాదానికి సిద్ధం అయ్యారు.

సజిత్ ప్రేమదాసప్రధాని కాబోరు

ప్రతిపక్ష పార్టీ సమాగి జన బాలవేగయ (ఎస్‌జెబి) నేత సజిత్ ప్రేమదాస ఇకపై ప్రధాని అవుతారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన పదవిని తీసుకునే ప్రసక్తే లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

పలు చోట్ల నిరసన ప్రదర్శనలు

సోమవారం ఉదయం పలు ప్రాంతాలలో నిరసనకారులు గుమికూడారు. అయితే టెంపుల్ ట్రీస్ వద్ద ఓ ప్రధాన ప్రదన్శన సాగింది. ఇది ప్రధాన మంత్రి అధికార నివాసం . ఇక్కడ గుమికూడిన జనం ప్రధాని మహీందా రాజీనామా చేయరాదని డిమాండ్ చేశారు. వారు ప్రధానిని నివాసంలోపలికి వెళ్లి బయటకు వచ్చారు. తరువాత ఆవరణలోనే వారు ప్రభుత్వ నిరసనకారులతో తలపడ్డారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు అయ్యాయి.వీరిని చికిత్సకు కొలంబో నేషనల్ హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చింది. ఆ తరువాత వెంటవెంట జరిగిన పరిణామాలలో ప్రధాని ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరడం తరువాత రాజీనామా ప్రకటన చేయడం వంటివి జరిగాయి. ఇకపై దేశాధ్యక్షులు ప్రస్తుత ప్రధాని శూన్యతను ఏ విధంగా భర్తీ చేస్తారు? ఘర్షణలు నిరసనలను ఏ విధంగా అదుపులోకి తెస్తారు? అనేది కీలక అంశం అయింది. కట్టుదిట్టమైన కర్ఫూ అమలులో ఉన్న కొలంబో ఇతర ప్రాంతాలలోనే జనం గుమికూడటంత, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉధృతం కావడం కీలక పరిణామాలకు దారితీసింది.

హింసాకాండతో ఏం సాధిస్తారు?

ఎక్కడైనా హింసాకాండ మరింతగా హింసను ప్రేరేపిస్తుంది. దీని వల్ల సమస్య సంక్షోభానికి దారితీస్తుంది. భావోద్వేగాలు పనికిరావు. శాంతియుతంగా సంయమనంతో వ్యవహరించడని ప్రధాని మహీందా తొలుత తమ ట్వీట్‌లో తెలిపారు. తమ సమస్యను తెలియచేసుకునే హక్కు అందరికి ఉంది. అయితే ఘర్షణలతో మరింతగా పరిస్థితి దిగజారుతుంది. ఆవేశాలతో ఫలితం ఉండదు. సంయమనంతో సవ్యమైన పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని తెలిపారు. ఆర్థిక సంక్షోభం ఏర్పడిన మాట వాస్తవమే . దీనికి సరైన దిశలో ఆర్థిక పరిష్కారాలు అవసరం. ఈ దిశలో పరిపాలనా యంత్రాంగం చర్యలు తీసుకొంటోంది. చక్కదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ట్వీట్‌లో మహీందా తెలిపారు.

హింసాకాండ ప్రభుత్వ మద్దతుదార్లదే : క్రికెటర్ సంగక్కర

నిరసనలు జరుపుతున్నది నిజమైన జనం , వారు శాంతియుతంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వ మద్దతుదార్లు ప్రదన్శనల్లోకి చొరబడి హింసాకాండకు దిగుతున్నారని ప్రధాని మహీందాకు మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర జవాబిచ్చారు, ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన గూండాలు రౌడీలే ఈ పరిస్థితిని కల్పిస్తున్నారని విమర్శించారు. శాంతియుత ప్రదర్శనలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News