Monday, November 25, 2024

అమేథీలో దళిత బాలికపై దాడి

- Advertisement -
- Advertisement -

Attack on a Dalit girl in Amethi

అరికాళ్లపై కర్రలతో కొట్టిన దుండగులు
ఇద్దరి అరెస్ట్

అమేథీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో దళిత బాలిక(16)పై దుండగులు కుల దురహంకార దాడికి పాల్పడ్డారు. ఫోన్లు చోరీ చేసిందన్న ఆరోపణలతో కాళ్లపై కర్రలతో కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చారు. బాధితురాలి పాదాలకు తీవ్ర గాయాలైనట్టు చెబుతున్నారు. రాయ్‌పూర్ ఫుల్వారీ గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులపై పోక్సోతోపాటు ఎస్‌సి,ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. వీడియోలో ముగ్గురు పురుషులు దాడికి పాల్పడినట్టు కనిపిస్తోంది. ఇద్దరు బాలికను పట్టుకోగా, మరొకడు కర్రతో ఆమె అరికాళ్లపై కొట్టడం వీడియోలో రికార్డయింది.

పక్కన ముగ్గురు మహిళలు కూడా కనిపిస్తున్నారు. అయితే, వారు దాడికి పాల్పడినట్టు లేదు. నిందితుల్లో ఒకడు సూరజ్‌సోనీగా, మరొకడు శివంగా గుర్తించి, అరెస్ట్ చేశామని అమేథీ డిఎస్‌పి ఆర్పిత్‌కపూర్ తెలిపారు. వీరిద్దరూ అమేథీ పట్టణానికి చెందినవారే. సూరజ్‌వి రెండు మొబైల్ ఫోన్లు పోయాయంటున్నారు. బాలిక చోరీకి పాల్పడినట్టు అనుమానముంటే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దాడికి పాల్పడటంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

దోషుల్ని 24 గంటల్లోగా
అరెస్ట్ చేయాలి ః ప్రియాంకాగాంధీ

దాడిని ఖండించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ

ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. బాలికపై అమానుష దాడికి పాల్పడిన నేరగాళ్లను 24 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడ్తామని ప్రియాంక హెచ్చరించారు. యుపిలో దళితులపై రోజుకు సగటున 34 దాడులు జరుగుతున్నాయని ప్రియాంక ట్విట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి,భద్రతల్ని కాపాడటంలో విఫలమైందని విమర్శించారు. బాలికపై దాడి ఘటనను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఖండించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమేథీ నుంచి ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారన్నది గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News