ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు ఎంపిపి నేనావత్ అనిత, విజయ్ దంపతులపై దాడి జరిగింది. ఎస్‌ఐ బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం…మేడిగడ్డ తండా సమీపంలోని మౌటెన్‌వ్యూ అనే వెంచర్‌కు అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు బుధవారం ఎంపిఒ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యతో కలిసి ఎంపిపి అనిత, ఆమె భర్త విజయ్‌నాయక్ వెళ్లారు.
అదే సమయంలో వెంచర్‌లో పని చేస్తున్న నేనావత్ రవీందర్‌నాయక్ అనే వ్యక్తి అకారణంగా ఎంపిపి దంపతులపై దాడి చేసి గాయపరిచారు. ఎంపిపి అయిన తనను బూతులు తిడుతూ, కొడుతూ తన చీర, జాకెట్‌ను చింపివేశాడని, తన భర్త విజయ్ అడ్డుకుంటుండగా అక్కడే ఉన్న బండరాయితో అతని తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తనను అవమానపరిచి, తన భర్తను కొట్టిన రవీందర్‌నాయక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపిపి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.