మెల్‌బోర్న్ ( ఆస్ట్రేలియా ) : ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. దక్షిణ బ్రిస్బేన్‌లోని బర్‌బాంక్ సబర్బ్ లోగల శ్రీలక్ష్మీనారాయణ దేవాలయం ప్రహరీ గోడను దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ పూజారి, భక్తులు ఈరోజు ఉదయం ఈ సంఘటన గురించి తనకు తెలియజేశారని, ఆలయ ప్రెసిడెంట్ సతీందర్ శుక్లా ఆస్ట్రేలియా టుడే వెబ్‌సైట్‌కు వివరించారు. క్వీన్స్‌ల్యాండ్ పోలీస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయగా, ఆలయానికి, భక్తులకు భద్రత చేకూరుస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. ఈ తాజా నేర సంఘటన ఆస్ట్రేలియా లోని హిందువులను భయపెట్టడానికేనని హిందూ మానవ హక్కుల డైరెక్టర్ సరా గేట్స్ పేర్కొన్నారు. దాడి జరిగిన తరువాత ఆలయం వద్ద హిందువుల ఆందోళన చేసే దృశ్యాన్ని ఆలయ కమిటీ సభ్యులు కొందరితో కలిసి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న దృశ్యాలను ఆమె ట్వీట్ చేశారు.
గత రెండు నెలల్లో ఆస్ట్రేలియా లోని హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది నాలుగోది. మెల్‌బోర్న్ ఇస్కాన్ ఆలయం గోడలను జనవరి 23న ధ్వంసం చేయగా, జనవరి 16న విక్టోరియా కేర్రమ్ డౌన్స్‌లో చారిత్రక శ్రీ శివవిష్ణు ఆలయ గోడలను ధ్వంసం చేశారు. జనవరి 12న మెల్‌బోర్న్ లోని స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. భారత ప్రభుత్వం ఈ విధ్వంస సంఘటనలను ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లింది. గతనెల భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు కూడా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ను కలుసుకున్నప్పుడు ఈ సంఘటనలపై ప్రస్తావించారు. ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యలపై నిఘా ఉంచాలని కోరారు.