Saturday, November 16, 2024

బండి యాత్రపై కోడిగుడ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

భీమదేవరపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీలను గ్రామ గ్రామాన.. గడపగడపకు తెలియజేయాలని కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీని ప్రధానిగా మూడోసారి చేయడమే లక్షంగా తాను ప్రజాహిత యాత్రను చేపట్టానని అన్నారు. యాత్ర ప్రారంభానికి ముందు కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటు దేశానికి, ఇటు రాష్ట్రానికి మోడీ చేసిన పనులను వివరిస్తూ యాత్రను కొనసాగించారు. భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామంలో బండి సంజయ్ చేపట్టిన ప్రజా హిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి యత్నించారు. అయితే, ఈ కోడిగుడ్లు యాత్రను కవర్ చేస్తున్న మీడియా ఛానల్ కెమెరాలపై పడ్డాయి.

దీంతో బిజెపి కార్యకర్తలు అప్రమత్తం కావడం కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడి పట్ల బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తమకార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరన్నారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని అన్నారు. బండి సంజయ్‌పై కోడిగుడ్లతో దాడితో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోడిగుడ్లు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్త గజ్జెల సురేష్ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News