Thursday, January 23, 2025

పౌర ప్రజాతంత్ర హక్కులపై దాడి

- Advertisement -
- Advertisement -

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అనుసరించే రాజకీయార్థిక విధానాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మోడీ ప్రభుత్వం బడాభూస్వామ్య, బూర్జువా, సామ్రాజ్యవాద ద్రవ్యపెట్టుబడికి విధేయతతో ఊడిగం చేసింది. అదే సమయంలో మనువాద, ఫాసిస్టు తరహా పద్ధతులను దూకుడుగా అమలు చేసింది. మరోవైపు రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, ఆర్‌బిఐ, ఇడి, సిబిఐ వంటి సంస్థలు స్వతంత్రతను, విశ్వసనీయతను కోల్పోయి ప్రభుత్వ జేబు సంస్థలుగా మారి తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. దేశ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ అసమర్థ,

అసంబద్ధ పాలనా విధానాల ద్వారా దేశ ఆర్థిక, సామాజిక జనజీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. 2014 ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతో మోడీ తెరపైకి వచ్చారు. ఆర్భాట ప్రసంగాలు, అమోఘమైన వాగ్దానాలు, హావభావ విన్యాసాలు, ఆచరణకు నోచుకోని హామీలతో దేశ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన మోడీ దేశాన్ని అన్ని విధాలా అధోగతి పాలు చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ పడిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. పౌర ప్రజాతంత్ర హక్కులపై దాడి పెరిగింది.ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి.నిరుద్యోగం 45 సంవత్సరాలలో అతి ఎక్కువ స్థాయికి చేరింది.ఇవాళ దేశంలో ఏనాడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు.
ఎన్నేళ్లు పాలించినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీరుంది. అభివృద్ధి నినాదాలు, ప్రజాకర్షక వాగ్దానాల ప్రచార తప్ప ప్రజాహిత కార్యక్రమాలు ఒక్కటీ చేపట్టలేదు. స్వావలంబనకు కీలకంగా ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు.

ప్రభుత్వ సంస్థలు, గనులు, విద్యుత్, చమురు, గ్యాస్, ఓడరేవులు, విమానాశ్రయాలు వగైరా ప్రైవేటీకరించారు. పర్యవసానంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. ‘ది ఎకానమిస్ట్’ అంచనా ప్రకారం ముఖేశ్ అంబానీ నికర సంపద 2016 -20 మధ్యకాలంలో 350% పెరిగింది.ఇదే సమయంలో గౌతం అదానీ నికర సంపద 750% పెరిగింది. 2014లో అదానీకి 60 వేల కోట్ల రూపాయల సంపద ఉండగా, 2022 చివరి నాటికి రూ. 20 లక్షల కోట్లకు పెరిగింది. అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానానికి చేరగా, సామాన్య ప్రజలు అధిక భారాలతో చితికిపోయారు. అయితే ఇదంతా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యంలోని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధాన నిర్మాణంలో అంతర్భాగమే. మోడీ పాలనలో నిజం మాట్లాడటం నేరం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విమర్శిస్తే నేరం. మోడీకి వ్యతిరేకంగా గళం విప్పితే నేరం. ప్రశ్నించే గళాలకు సంకెళ్లు నిత్యకృత్యమయ్యాయి. ఇవాళ దేశంలో హక్కులను, ప్రజాశ్రేయస్సును కాంక్షించేవారికి రక్షణ లేదు. ఇంతటి ఫాసిస్టు నిర్బంధాన్ని దేశం గతంలో ఏనాడు ఎదుర్కోలేదు.

ఇవన్నీ ఇలా ఉండగా మోడీ పాలన దేశ మౌలిక స్వరూపాన్నే మార్చివేసే పథకాన్ని అమలు పరుస్తున్నది. భిన్నమతాల, భాషల, ప్రాంతాల, సంస్కృతుల దేశంగా శతాబ్దాల తరబడి కొనసాగుతున్న భారత సంస్కృతిని, ఒకే మత సంస్కృతిగా మార్చివేసి మైనారిటీలను రాచిరంపాన పెట్టే వ్యవస్థను నెలకొల్పడానికి సాగుతున్న దగా గురించి వివరించి చెప్పనక్కర లేదు. మహిళా లోకాన్ని అడుగు బయటపెట్టకుండా నాలుగు గోడలకే పరిమితం చేసే దుష్టఆలోచన తెర వెనుక సాగుతున్నది. ప్రజలకు తాత్కాలికంగా ఎదురవుతున్న ఆకలి, నిరుద్యోగం వంటి సమస్యలను ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు. కాని సెక్యులర్ రాజ్యాంగాన్ని కొనసాగనిస్తూనే అది బోధిస్తున్న వైవిధ్యాన్ని బలి తీసుకోవడం వల్ల దేశానికి అపరిమితమైన హాని కలుగుతుంది. మోడీ బలం ఆయన ఆర్థిక విధానాలలో లేదు. భారత జాతీయవాదం దేశ పౌరులందరినీ సమానంగా చూస్తుంది. కాని హిందూ జాతీయవాదం ఈ దేశం హిందువులది మాత్రమే నని ఇతరులంతా పరాయివారుగా విభజిస్తుంది. విద్వేష రాజకీయాన్ని సాగిస్తున్నది. ఈ భావజాలమే దేశానికి ఒక హీరోని ముందుకు తెస్తుంది.

భక్తులని, ఉన్మాదులను తయారు చేస్తుంది. ఈ అగ్గి చల్లారకుండా రోజుకొక మతవివాదాన్ని ముందుకు తెస్తారు. ఒక మందిరం తర్వాత మరొక మందిరం, ఒక కట్టడం తర్వాత మరో కట్టడం, ఒక పేరు మార్పిడి తర్వాత మరొకటి, చరిత్రను తిరగరాయడం, పురాణాలే చరిత్రలుగా ప్రకటించడం, మనువాదమే మన రాజ్యాంగం అనే వివాదాలే నిత్య ఎజెండా అవుతుంది. నిత్య చర్చల పేరుతో మీడియా ఈ విద్వేషాన్ని రోజువారీ టానిక్కుగా ప్రజలకు అందిస్తాయి. ఇలాంటి ఉన్మాదం, విద్వేషం ప్రజల తలకెక్కితే నిత్య జీవిత సమస్యలు తెరమరుగవుతాయి. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విద్వేష రాజకీయం, ఉన్మాద రాజకీయం, ఫాసిస్టు భావజాలం పౌరసమాజపు లోకజ్ఞానంలో భాగం అవుతున్నది. ఇదే మోడీకి బలంగా మారుతున్నది. ప్రశ్నించేవాడు దేశద్రోహి అవుతాడు. కాదన్నవాడు జైలు పాలవుతాడు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక దేశంలో ఆర్థిక వృద్ధి పెరిగినా ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. అంటే పెరుగుతున్న వృద్ధి ఉపాధి రహిత వృద్ధి అని అర్ధమవుతున్నది. వేగంగా పెరుగుతున్న యాంత్రీకరణ,

దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి కానీ, ఉపాధి పెరుగడం లేదు. మన దేశంలో పెరుగుతున్న జిడిపి వృద్ధి రేటు, నిరుద్యోగితా రేటును పోల్చిచూస్తే మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అర్థం కాగలదు. 1999లో జిడిపి వృద్ధిరేటు 8.85 ఉంటే నిరుద్యోగితా రేటు 5.74 ఉండింది. 2003లో జిడిపి వృద్ధి రేటు 7.5 ఉంటే నిరుద్యోగితా రేటు 5.64 ఉండింది. 2021లో జిడిపి వృద్ధి రేటును 8.95గా గుర్తించారు. అయితే నిరుద్యోగితా రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. 2022లో ఇది 8.7%గా నమోదైంది.కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న శాఖల్లో తొమ్మిదేళ్లలో 8 లక్షల పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం ఇంకా 18 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్హతలకు తగిన కొలువు దొరక్క 22 కోట్ల మంది యువతీ, యువకులు వీధుల్లో చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరికి ప్రతి ఏటా ఒక కోటి ఇరవై లక్షల మంది కొత్తగా తోడవుతున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజా నివేదిక ప్రకారం

మార్చిలో 7.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి ఎగబాకింది. వయస్సు మీరిపోతున్నా తాము చదువుకొన్న చదువులకు తగిన ఉద్యోగావకాశాలు లేక నిరాశకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీరు ఇచ్చిన 80 వేల నియామక పత్రాలు అందులో ఎంత, ఏమేరకు అని యువత ఎద్దేవా చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇంకొక వైపు వివిధ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలంటూ లేని పరిస్థితిని సృష్టిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఒక వైపరీత్యం కనిపిస్తోంది. సహజంగా జాతీయ ఆదాయం పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తాం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక దేశంలో ఆర్థిక వృద్ధి పెరిగినా ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. అంటే పెరుగుతున్న వృద్ధి ఉపాధి రహిత వృద్ధి అని అర్ధమవుతున్నది. వేగంగా పెరుగుతున్న యాంత్రీకరణ, దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి. కానీ, ఉపాధి పెరగడం లేదు. దేశంలో పెరుగుతున్న జిడిపి వృద్ధి రేటు, నిరుద్యోగితా రేటును పోల్చిచూస్తే

మన ఆర్థిక వ్యవస్థ పని తీరు అర్థం కాగలదు. 1999లో జిడిపి వృద్ధిరేటు 8.85 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.74 ఉండింది. 2003లో జిడిపి వృద్ధి రేటు 7.5 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.64 ఉండింది. 2021లో జిడిపి వృద్ధి రేటును 8.95గా గుర్తించారు. అయితే నిరుద్యోగితా రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. 2022లో ఇది 8.7 శాతంగా నమోదైంది. నిరుద్యోగం, దారిద్య్రం, ఆర్థిక అసమానతలు ఆందోళనకరమైన రీతిలో పెరిగాయి. అయినప్పటికీ ఆర్థిక మందగమనం పట్ల ప్రభుత్వం స్పందిస్తున్నతీరు, ఆదాయం,- సంపదలలో అసమానతలు మరింత పెరగడానికే కారణమయింది. ఇదే సమయంలో ఆశ్రిత కార్పొరేట్ తీసుకున్న బకాయిలు పెద్ద పెద్ద మొత్తాలలో (11లక్షల కోట్లు) రద్దు చేయబడినాయి. ఈ విధంగా మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన కార్పొరేట్లకు ఉపయోగం గాను, సామాన్యులకు భారం గాను పరిణమించింది. ఈ కార్పొరేట్, హిందుత్వ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంత మంచిది. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే బడా భూస్వామ్య, బూర్జువా, సామ్రాజ్యవాద, మతతత్వ పాలకుల కూటమికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర ఉద్యమాన్ని చేపట్టి విజయవంతం చేసుకోవడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News