Sunday, November 17, 2024

రాజ్యాంగ హక్కులపై దాడి

- Advertisement -
- Advertisement -

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయ్యాయి. నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు కావస్తుంది. ఇండో బ్రిటీష్ రాజ్యాంగం సుమారు 250 ఏండ్లు నాడే వచ్చింది. కానీ మనువాద బ్రాహ్మణీయ భావజాలమే సామాజిక కట్టుబాట్ల రూపంలో ఇప్పటికీ దేశ ప్రజల సామాజిక, సాంస్కతిక రంగాలను అజమాయిషీ చేస్తున్నది. 1950 జనవరి 26న భారత దేశానికి వచ్చిన కొత్త రాజ్యాంగం ప్రజాస్వామ్య, మతాతీత, సామ్యవాద లక్ష్యాలను ప్రకటించింది. ఇది? సహించని మనువాదులు రాజ్యాంగంపై దాడికి పూనుకున్నారు. అసలు రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలు ఏమిటి? రాజ్యాంగ స్వాతంత్య్రాన్ని సాధించిన మనం ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రాలు సాధించామా? ఇవన్నీ సమీక్షించుకోవలసిన సమయం ఇది. అరవై దేశాల రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి, డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వంలో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించి, రాజ్యాంగ పీఠికలు, రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను వివరించారు.

సమాఖ్య విధానం (ఫెడరిలిజం), లౌకిక విధానం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్థిక- సామాజిక న్యాయం మొదలైనవి రాజ్యాంగ లక్ష్యాలుగా ఉన్నాయని కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసంస్కరణలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన కేసులో 1973లో సుప్రీంకోర్టు పేర్కొన్నది. కానీ నేడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత సమాఖ్యను (ఫెడరిలిజం) దెబ్బ తీయటానికే ప్రయత్నిస్తున్నది. జిఎస్‌టిని ప్రవేశపెట్టి రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతీసినది. నీతి ఆయోగ్‌కు ఎటువంటి చట్టబద్ధత లేదు. దాని ద్వారా రాష్ట్రాలపై కేంద్రం స్వారీ చేస్తున్నది. రాష్ట్రాలలో ప్రభుత్వాలను రకరకాల కుట్రలతో కూల్చివేస్తున్నది. తమకు నచ్చని రాష్ర్ట ప్రభుత్వాలకు నిధులు సక్రమంగా కేటాయించటం లేదు. భారత సమాఖ్య దెబ్బతింటే దేశ సమగ్రత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది.

భారత దేశ సమగ్రత, ప్రజాస్వామ్య భద్రత లౌకికవాదంతో ముడిపడి ఉన్నది. రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొన్నది. అయితే హిందూ- ముస్లింల మధ్య అగాధాన్ని సష్టించి మెజారిటీ హిందూ మత పార్టీగా ఉండాలని బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. జమ్మూ కశ్మీర్ 370వ ఆర్టికల్ రద్దు చేసింది. మైనారిటీలపై, దళితులపై దాడులు చేస్తూ మతపరమైన విభజనలు సష్టిస్తున్నారు. సిఎఎ వంటి చట్టాల ద్వారా మత ఆధారిత పౌరసత్వం కోసం పావులు కదుపుతున్నాయి. పాఠ్య పుస్తకాలను, సిలబస్‌ను మత ఆధారిత అంశాలుగా మారుస్తున్నారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసి లౌకికవాదం బలహీనపడే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బాహాటంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మతపరమైన విభజన లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు నష్టదాయకం. మన రాజ్యాంగం ప్రాథమిక హక్కుల ద్వారా ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించి, సంఘాలను ఏర్పాటు చేసుకోవటానికి ఉద్యమాలకు అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తుంది.

భిన్నాభిప్రాయాలను సహించలేని పరిస్థితులు, అసహన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి. నిజమైన జాతీయ నాయకులను తమ స్వంతం చేసుకునే పనిలో విఫలం కావడంతో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల కేంద్ర ప్రభుత్వం అధికారిక మీడియా మీద, ఎన్‌సిఇఆర్‌టి మీద, పాఠ్య పుస్తకాల మీద తమ అధికారాన్ని వినియోగిస్తూ సావర్కర్, హేడ్గేవార్ వంటి వారిని గొప్ప జాతీయతావాద నాయకులుగా చెలామణి చేయాలని ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఆర్థిక, సామాజిక న్యాయాన్ని ప్రస్తుత పాలకులు పూర్తిగా విస్మరించారు. ఆర్థిక సంస్కరణల వేగాన్ని పెంచి, లాభాలతో నడిచే పరిశ్రమలను సైతం ప్రైవేటీకరిస్తున్నారు. మానిటైజేషన్ పేరుతో మౌలిక రంగాలను కూడా ప్రభుత్వం అమ్ముతున్నది.

ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేద ప్రజలకు, రైతులకు, అసంఘటిత రంగ కార్మికులకు, సామాజిక వర్గాలకు నష్టదాయకమే. ఒకే భాష, ఒకే సంస్కతి, ఒకే మార్కెట్, ఒకే పన్ను, ఒకే విద్యా విధానం, ఒకే ఆహారపు అలవాట్లు ఇలా పైకి ఆకర్షణీయంగా కనిపించే నినాదాలతో హిందూత్వ – బిజెపి ప్రభుత్వం మన దేశంలోని వివిధ జాతుల, భాషల, సంస్కృతుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని కాలరాయజూస్తున్నది. మనువాదాన్నే మన దేశ జీవన విధానంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నది. భిన్న మతాల నడుమ ఉన్న సామరస్యాన్ని నాశనం చేస్తున్నది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసి, అధికారాలన్నీ తన గుప్పెట్లో బిగించుకుంటున్నది. హిందూత్వ శక్తులు ఎక్కిస్తున్న జాతీయతా భావం నిజానికి దేశంలోని వివిధ జాతుల, మతాల, ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది.

భిన్న భాషలను, భిన్న సంస్కతులను బేఖాతరు చేస్తుంది. చివరికి ఏ తిండి తినాలో, ఏ విధంగా దుస్తులు ధరించాలో, ఏ సినిమా చూడాలో, ఎవరిని పెళ్ళాడాలో కూడా శాసిస్తుంది. దీనికి తలొగ్గడం అంటే మన యువత తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. ఇక్కడ విచిత్రమే మిటంటే చేసే వ్యాఖ్యలూ, వ్యవహారాలూ, దాడులూ, దౌర్జన్యాలూ దేశభక్తి పేరుతో జరుగుతున్నాయి. దేశాన్ని రక్షించే పేరుతో నడుస్తున్నాయి. ఆవులకు ఒక ప్రత్యేకత, పవిత్రత ఆపాదించి మనుషులపై దాడులు, హత్యలూ జరుగుతున్నాయి. దేశభక్తి గురించి మాట్లాడుతూ భిన్నాభిప్రాయంపై దాడులూ దౌర్జన్యాలూ, మహిళల గొప్పతనం గురించి కీర్తిస్తూ కథలు కల్పిస్తూ స్త్రీలపై, వారి ప్రాథమిక హక్కులపై దాడులూ, అత్యాచారాలూ నిత్యకత్యంగా జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కన్నా మనుస్మతి ఎక్కువ. ఆధునిక సమాజపు ఆకాంక్షల కన్నా ఆటవిక యుగపు దౌర్జన్యాలపై మక్కువతో దేశాన్ని మనుషులతో చూడలేని అంధత్వంలో నిండియున్నారు.

దేశాన్ని మనుషులుగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారిని కులాలుగా, మతాలుగా విడగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే కుతంత్రం దాగి ఉన్నది. ఇలాంటి విధ్వంసం జరుగుతున్నప్పుడు స్వాతంత్య్రానికి అర్థం ఏముంది? కుల మతాలకు అతీతంగా పౌరుడిని పౌరుడిగా గుర్తించాలన్న రాజ్యాంగం స్ఫూర్తికి మూకస్వామ్యపు ఉన్మాదంతో ఆ స్ఫూర్తికి బహిరంగంగానే తూట్లు పొడుస్తోంది. మనమిప్పుడు స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, చివరకు రాజ్యాంగాన్నీ కాపాడుకోవాల్సిన ఆత్మగౌరవ స్థితిలో ఉన్నాం. హిందూత్వ గురించి గొప్పగా చెప్పుకుంటూ మరో వైపు దేశాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదులకు అప్పజెప్తున్న బిజెపి-, ఆరెస్సెస్ ద్రోహాన్ని ఇటువంటి ఆత్మగౌరవ ఉద్యమమే బయటపెట్టగలదు. అందుకే నాడు స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా పోరాడిన అమరవీరులు మనకు స్ఫూర్తి కావాలి. భారత రాజ్యాంగాన్ని భారత దేశ ప్రజలమైన మేము.. అని మొదలు పెట్టి ఈ దేశ ప్రజానీకానికి సార్వభౌమాధికారాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు కట్టబెట్టారు.

అంతేకాదు సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా రాజ్యాంగ పీఠికలోనే స్పష్టంగా వుంది. అందువల్ల పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఏ ఒక్కటీ సర్వోన్నతం కాదు కాబోవు. ఈ దేశంలో సర్వోన్నత సార్వభౌమాధికారం రాజ్యాంగానిదే అంటే ప్రజలదే. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఈ మూడింటిలో ఒక అంగంలో మెజార్టీ సభ్యులున్నంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చేయాలనుకుంటే అలాంటి పప్పులుడకవు. భారత గణతంత్ర, లౌకిక, ప్రజాతంత్ర లక్షణాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో ఫాసిస్టు హిందూత్వ రాష్ర్ట ఏర్పాటుకు జరుగుతున్న కుట్రల పట్ల ప్రజాస్వామ్య వాదులందరూ అప్రమత్తంగా వుండాలి. సార్వభౌమాధికారాన్ని కలిగియున్న దేశ ప్రజానీకమే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని కూడా పరిరక్షించుకోవాలి.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News