Saturday, November 23, 2024

అంతటా ప్రజాస్వామ్యంపై దాడి!

- Advertisement -
- Advertisement -

Attack on Democracy throughout

ప్రాణాంతక కరోనా మహమ్మారి, ఆర్థిక, శారీరక అభద్రత, హింసాత్మక సంఘర్షణ ప్రపంచంపై ముప్పు తీసుకు రావడంతో 2020లో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం నిత్యం శ్రమించే ఉద్యమకారులకు నిరంకుశ శక్తులపై తమ పోరాటంలో నూతన నష్టాలను చూడవలసి వచ్చినదని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఫ్రీడమ్ హౌస్ ‘స్వాతంత్య్రం’ పై ప్రచురించిన తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుతం దేశాధినేతలు తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు, నిరసనలను కట్టడి చేసేందుకు, కొన్నిసార్లు ప్రజారోగ్యం పేరిట అణచివేత చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. అటువంటి అణచివేతను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన అంతర్జాతీయ మద్దతు లోపించడంతో ఉద్యమకారులు భారీగా జైలు శిక్షలు, హింసలు లేదా హత్యలను గురికావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఫ్రీడమ్ హౌస్ ‘స్వాతంత్య్రం’పై వార్షిక నివేదికలు ప్రచురించడం ప్రారంభించిన గత 15 ఏళ్లుగా పరిస్థితులు క్షీణిస్తున్నాయని, ప్రజాస్వామ్య పరిస్థితులు మెరుగవుతున్న దేశాల సంఖ్య కన్నా క్షీణిస్తున్న దేశాలు ఎక్కువగా ఉంటూ ఉండడంతో దీర్ఘకాలం ప్రపంచం ‘ప్రజాస్వామ్య మాంద్యం’ను చూస్తున్నట్లు అవుతున్నదని స్పష్టం అవుతున్నది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య క్షీణత ప్రభావం ప్రపంచ వ్యాప్త స్వభావంగా మారింది. ప్రపంచ జనాభాలో దాదాపు 75 శాతం మంది గత సంవత్సరం ప్రజాస్వామ్య క్షీణతకు గురైన దేశాలలో నివసిస్తున్నారు.

ప్రజాస్వామ్యంపై వ్యతిరేకులుగా ముద్రపడిన చైనా, రష్యా వంటి దేశాలలోని పాలకులు తమ అణచివేత చర్యలను కప్పిపుచ్చుకొంటూ అంతర్జాతీయంగా తమ ప్రభావం పెంచుకొనే ప్రయత్నం చేస్తుండగా, ప్రజాస్వామ్య దేశాలలోని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు సహితం తమ ప్రాబల్యాన్ని స్థీరీకరించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు శక్తులు కూడా అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య విచ్ఛిన్నతను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ శక్తులు ప్రజాస్వామ్య విచ్ఛిన్నతిని సంబరంగా జరుపుట్టుకొంటూ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ధైర్య, సాహసాలు ప్రదర్శించే వర్గాలను అణచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నియంతృత్వ పాలనలోని చైనాపాలన దుష్ట ప్రభావం 2020లో చాలా లోతుగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

తొలుత కరోనా వైరస్ వ్యాప్తిని కప్పిపుచ్చడం ద్వారా దాని కట్టడికి ప్రపంచం సత్వరం స్పందించకుండా చేయగలిగిన చైనా అందుకు తన దుష్ప్రచార సాధనాలను ఉపయోగించింది. పైగా, విదేశీ ప్రజాస్వామ్య దేశాల అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, తమ దేశంలోని ప్రధాన భూభాగంలో సాధారణమైన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడంతో పాటు హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛ, చట్టపరమైన స్వయంప్రతిపత్తిని కూల్చివేయడంకు గత ఏడాది చైనా పాల్పడింది.

మరో వంక, చైనా పాలకులు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి వంటి బహు పాక్షిక సంస్థలలో ప్రాబల్యం సాధించడం ద్వారా ప్రజాస్వామ్య సూత్రాలను, మానవ హక్కుల ప్రమాణాలను దుర్వినియోగం చేయకుండా తగు చర్యలు తీసుకోవడంలో అంతర్జాతీయ సంస్థలను ముందుకు సాగనీయకుండా నిరంకుశ పొత్తులకు మార్గం ఏర్పర్చుకొనేటట్లు చేస్తున్నది. గత ఏడాది అంతా కరోనా వ్యాప్తి చెందుతూ ఉండడంతో ఆ సాకుతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పదేపదే నిఘా వ్యవస్థను పటిష్ట పరచడం ద్వారా, ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలపై ఆంక్షలను పెంచడం ఎక్కువైనది. పోలీసులు, ప్రభుత్వేతర సంస్థలు అటువంటి ఆంక్షలను ఏకపక్షంగా లేదా నిరంకుశంగా అమలు జరిపే ప్రయత్నం చేశారు.

కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసిన తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని అనేక దేశాలు తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా విస్తృతంగా వ్యాపింప చేశాయి. వాస్తవాలు ప్రజలకు చేరకుండా కట్టడి చేయడం ద్వారా, వారి జీవితాలను ప్రమాదం అంచుకు నెట్టివేశాయి. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలున్న పలు దేశాలు వైరస్ ముప్పు అవసరాల మేరకే ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించగా, వెనిజులా నుండి కంబోడియా వరకు చాలా దేశాలు వికృత సమాచార వ్యూహాలు అమలు పరుస్తూ తమ రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు, తమ అధికారాన్ని మరింతగా బలోపేతం చేసుకొనేందుకు ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకున్నారు.

అంతర్జాతీయ వేదికలపై ప్రధాన ప్రజాస్వామ్య దేశాల ప్రాబల్యం తగ్గుతూ ఉండడం, మరోవంక అస్థిరమైన ఉనికితో నిరంకుశ ప్రభుత్వాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకొంటూ ఉండడంతో మొత్తం మీద మానవ జీవనం, భద్రతలపై స్పష్టమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఈ నివేదిక పేర్కొన్నది. రాజకీయ వివాదాలను పరిష్కరించడం కోసం పలు ప్రభుత్వాలు తరచుగా సైనిక శక్తిని ఆశ్రయించడం రివాజుగా మారినట్లు తెలిపింది.

భారత్‌లో క్షీణించిన ప్రజాస్వామ్యం

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్యం, భారతదేశం 2021లో ‘స్వేచ్ఛాయుత’ దేశాల జాబితా నుండి ‘పాక్షికంగా స్వేచ్ఛాయుత’ దేశాల జాబితాకు దిగజారిన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయనకు మద్దతుగా ఉన్న రాష్ట్రస్థాయి ప్రభుత్వాలు సంవత్సరం అంతా విమర్శకులను అణచివేస్తూనే ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
కరోనాకు ప్రతిస్పందనగా విధించిన ఇంటికే పరిమితం చేసే లాక్‌డౌన్ ఫలితంగా లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రమాదంలో చిక్కు కొనడాన్ని ప్రస్తావించింది. ప్రభుత్వం వారి గురించి ఎటువంటి ప్రణాళిక లేకుండా వ్యవహరించినట్లు తప్పు బట్టింది. అధికారంలో ఉన్నవారు ముస్లింలను వైరస్ వ్యాప్తికి బాధ్యులుగా ప్రచారం చేయడంతో పలు చోట్ల వారిపై దాడులు కూడా జరిగిన్నట్లు తెలిపారు. చైనా వంటి నిరంకుశ దేశాలకు ప్రత్యర్థిగా, ప్రజాస్వామ్య దేశాలను నడిపించవలసిన ప్రధాని మోడీ భారత దేశాన్ని విషాదకరంగా నిరంకుశ పాలన వైపు నడిపిస్తున్నారని ఈ నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక అమెరికాలో పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు, నవంబర్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించడానికి నిరాకరించడం, కాపిటల్ భవనంపై దాడి జరగడంతో కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను చివరగా ధ్రువీకరించడంలో జాప్యం జరిగినదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమెరికా జనాభాలో చాలా మందిలో అపనమ్మకం కలిగించే విధంగా ఎన్నికల మోసాల గురించి తప్పుడు ఆరోపణలు చేయడం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లవారిపై పోలీసులు జరిపిన అసమాన హింసను ప్రజలు క్షమించినా అధ్యక్షుడి ప్రేరణతో అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్న చోట హింస చెలరేగడం దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేసిన్నట్లు ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా సుపరిపాలన కోరుతూ 2019లో విస్తృతంగా వ్యాపించిన నిరసన ఉద్యమాలు 2020లో పెరిగిన అణచివేతను ఎదుర్కోవలసి వచ్చిన్నట్లు ఫ్రీడమ్ హౌస్ తెలిపింది. చిలీ, సుడాన్ వంటి దేశాలలో విజయవంతమైన నిరసనలు ప్రజాస్వామ్య మెరుగుదలకు దారితీసినప్పటికీ, ఇంకా చాలా చోట్ల ప్రదర్శకులు అణచివేతకు గురయ్యారని తెలిపింది.
2019 లో పెద్ద నిరసనలు ఎదుర్కొన్న దాదాపు రెండు డజన్ల దేశాలు, భూభాగాలు మరుసటి సంవత్సరం స్వేచ్ఛలో నికర క్షీణతను ఎదుర్కొన్నాయని ఈ నివేదిక పేర్కొన్నది. ‘పాక్షిక స్వాతంత్య్రం’ హోదాకు భారత్ క్షీణించడంతో ప్రపంచ జనాభాలో 20 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఇప్పుడు స్వేచ్ఛా దేశాలలో నివసిస్తున్నట్ల అయింది. స్వాతంత్య్రం క్షీణించడానికి బాధ్యులైన వారు తాము ప్రజల అవసరాలు తీర్చలేక పోవడానికి తప్పుడు కథనాలను అల్లుతున్నారని ఈ నివేదిక తప్పుబట్టింది. ప్రపంచ నాయకత్వం, ప్రజాస్వామ్య దేశాల మధ్య సంఘీభావం నేడు అత్యవసరంగా అవసరమని ఈ నివేదిక స్పష్టం చేసింది. వాషింగ్టన్ లో కొత్త పరిపాలనతో సహా ప్రజాస్వామ్యం విలువను అర్థం చేసుకునే ప్రభుత్వాలు, దాని ప్రయోజనాలను అందించడానికి, దాని విరోధులను ఎదుర్కోవటానికి, దాని రక్షకులకు మద్దతు ఇవ్వడానికి కలిసి కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉందని పిలుపిచ్చింది.

అధికారం కోసం ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే రాజకీయ నాయకులు, ఇతరులకు వ్యతిరేకంగా వారు ముందుగా తమ విశ్వసనీయతను పెంచుకోవాలని సూచించింది. అందుకు తమ దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసుకొని, తరగత పరిస్థితులను సర్దుబాటు చేసుకోవాలని చెప్పింది. స్వేచ్ఛా సమాజాలు ఈ ప్రాథమిక చర్యలను తీసుకోవడంలో విఫలమైతే, ప్రపంచం వారికి ప్రియమైన విలువలకు మరింత విరుద్ధంగా మారుతుందని, నియంతృత్వం విధ్వంసక ప్రభావాల నుండి ఏ దేశమూ సురక్షితంగా ఉండదని ఫ్రీడమ్ హౌస్ హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News