అటవీశాఖ, ఆదివాసీల నడుమ పోడు రగడ
ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఆదివాసీలు
బీట్ ఆఫీసర్‌ను చెట్టుకు కట్టేసిన పోడు సాగుదారులు
ఫారెస్ట్ భూమిలో పనులు అడ్డగించిన గిరిజనులు
మా పోడు భూముల్లో అటవీశాఖ పనులు నిర్వహించవద్దు
ప్రభుత్వ విప్ రేగా ఆదేశాలు బేఖాతర్
అటవీశాఖ భూముల్లో ట్రెంచ్ పనులు నిర్వహించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిని నిలువరించారు. ఈ పోడు భూములను మేము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటామని, ఈ భూములు మావి అని స్థానిక ఆదివాసీలు ఆ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటుగా ఓ బీట్ ఆఫీసర్‌ను చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన సోమవారం దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప అటవీ ప్రాంతంలోని డి. కొత్తూరు బీట్ పరిధిలో జరిగింది. దీనిపై మన తెలంగాణ దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం
మనతెలంగాణ/దుమ్ముగూడెం: ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంను విజయవంతం చేయటంలో పాటు అటవీ భూముల సంరక్షణ పనులు నిర్వహించడంలో దుమ్ముగూడెం అటవీశాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరో పక్క ఎన్నో ఏళ్లుగా అడవి తల్లినే నమ్ముకొని పోడు కొట్టి పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీ పోడు సాగుదారులకు హక్కు పత్రాలు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుధ్దితో పనిచేస్తుందని గతంలో సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దుమ్ముగూడెం మండల పర్యటన సందర్భంగా పోడు భూముల హక్కుదారులకు పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంతో పోడు సాగుదారులలో ఆనంద సంబరాలు మొదలైనవి. ఈ విషయాలు పక్కకు ఉంచితే ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేస్తున్నామని ఆదివాసీలు, 2005 సంవత్సరం డిసెంబర్ 13కి పూర్వం నుంచి అడవిలో నివసిస్తున్న గిరిజనులకు వారి అనుభవంలో ఉన్న పోడు భూములకు మాత్రమే హక్కు పత్రాలు వస్తాయి. తర్వాత నుంచి కొత్తగా పోడు కొట్టి సాగు చేసుకుంటున్న వారికి ఎటువంటి హక్కు పత్రాలు రావని, గతంలోనే అటవీ భూములు, పోడు భూములు రెండు కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ చేయడం జరిగిందని మండల ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలకు తెలిపారు.
కానీ ఇవి ఏమి పట్టని కొందరు గిరిజనులు అటవీ భూములలో గల చెట్టు, చేమలను, తుప్పాలను, పొదలను తొలగించి పోడు కొట్టి సాగు చేస్తున్నారు. గతంలో పని చేసిన అటవీశాఖ అధికారుల్లో సరైన అవగాహన లేకపోవడంతో పాటుగా మరి కొన్ని ఇతర కారణాలతో కొత్తగా పోడు కొట్టి పోడు వ్యవసాయం చేస్తున్నారు. సాగు చేసుకుంటున్న గిరిజనులకు, మండల అటవీ శాఖ అధికారులకు నడుమ గత నెలన్నర రోజులుగా పోడు రగడ తారా స్థాయికి చేరుకుంది. ఆదివాసీల పోడు భూములు గతంలోనే అటవీ భూములు అవ్వడంతో ఫారెస్ట్ అధికారుల మ్యాప్‌లో అవి అటవీ భూములుగానే చూపిస్తున్నాయి. కానీ ఈ భూముల్లో గత కొన్నేళ్లుగా మేము పోడు కొట్టి వ్యవసాయం చేస్తున్నామని, ఈ పోడు భూములు మాకే చెందుతాయి అనేది పొడు సాగుదారుల వాదన.
హరితహారం, అర్హులైన పోడు సాగుదారులకు హక్కు పత్రాలు మంజూరు చేసే పనిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది. ఈ క్రమంలో అడవులను సంరక్షిస్తూనే ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకంను విజయవంతం చేయడంలో మండల అటవీశాఖ వారు తమ అటవీ మ్యాప్‌లో చూపిస్తున్న భూములలో హరితహారం చేపట్టేలా కందకాలు తీసే పనులు నిర్వహించేలా ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పైడిగూడెం ఫారెస్ట్ భూములో ఆదివాసీ వర్సెస్ అటవీ శాఖ అన్నట్లుగా ఉండగా, సోమవారం చింతగుప్ప అటవీ భూములల్లో నిర్వహించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిపై ఈ పోడు భూములలో తాము ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటామని స్థానిక పోడు సాగుదారులైన ఆదివాసీలు అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఓ ఎఫ్‌బివోని చెట్టుకు కట్టేశారు. మరో ఇద్దరిపై సన్నటి కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆదివాసీలు ఫారెస్ట్ సిబ్బంది అయిన హుస్సేన్, రాజేష్, విజయపై దాడి చేశారు. ఈ విషయంను తెలుసుకున్న చింతగుప్ప సర్పంచ్ కట్టం కృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని ఆదివాసీలతో మాట్లాడి అటవీశాఖ సిబ్బందిని అక్కడ నుంచి పంపించేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. మొత్తానికి ఈ నెల 10వ తేదీన పైడిగూడెం అటవీ ప్రాంతంలోని తోగ్గూడెం భీట్‌లో జరిగిన పరిణామాలపై ప్రభుత్వ వీప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించి అటవీ శాఖ అధికారులకు, స్థానిక పోడు సాగుదారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రెండు రోజుల్లోనే ఈ సంఘటన జరగటంతో మండలమే కాదు జిల్లానే ఉలిక్కిపడేలా చేసిందని చెప్పవచ్చు.