కేంబ్రిడ్జ్ కార్యక్రమంలో రాహుల్ ఆరోపణ
కేంబ్రిడ్జ్: భారత్‌లో మాట్లాడేందుకు అవకాశమిచ్చే వ్యవస్థలపై ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్‌లో మాట్లాడేందుకు అవకాశం ఉన్న స్థానాలలోకి ప్రభుత్వం చొరబడి గొంతు మాట్లాడే గొంతులను నొక్కుతోందని ఆయన ఆరోపించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కార్పస్ క్రిస్టీ కాలేజ్‌లో సోమవారం సాయంత్రం ఇండియా ఎట్ 75 కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. హిందూ జాతీయవాదం మొదలుకుని కాంగ్రెస్ పార్టీలో గాంధీ(నెహ్రూ వారసులు) కుటుంబం పాత్రదాకా అనేక విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థుల నుంచి ఎదురైన అనేక ప్రశ్నలకు సమాధానమిచారు. తమ దృష్టిలో భారత్ మాట్లాడినపుడే భారత్ సజీవంగా ఉన్నట్లని, ఎప్పుడైతే భారత్ మౌనం వహిస్తుందో అప్పుడు మరణించినట్లేనని రాహుల్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామిక మౌలిక స్వరూపం వంటి భారత్‌లోని మాట్లాడే వవస్థలలోకి ప్రభుత్వం చొరబడి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. భారదేశాన్ని రాష్ట్రాల కూటమిగా ఆయన అభివర్ణించారు. ప్రతి రాష్ట్రానికి, ఆ రాష్ట్రాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం లభించాలని ఆయన అభిప్రాయపడ్డారు.